Sunday, February 1, 2026
E-PAPER
Homeఆటలువిజేత రైబకినా

విజేత రైబకినా

- Advertisement -

ఫైనల్లో టాప్‌సీడ్‌ సబలెంకాకు ఝలక్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను 5వ సీడ్‌, కజకిస్తాన్‌కు చెందిన ఎలైనా రైబకినా చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రైబకినా మూడుసెట్ల హోరాహోరీ పోరులో టాప్‌సీడ్‌, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకాను చిత్తుచేసింది. దీంతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2023లో తొలిసారి ఫైనల్‌కు చేరినా.. రన్నరప్‌కే పరిమితమైన రైబకినా.. ఈసారి పట్టువదలక టైటిల్‌ను సాధించడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రైబకినా 4-6, 6-4, 4-6తో సబలెంకాను చిత్తుచేసింది.

చివరి సెట్‌ 3-3 పాయింట్లతో సమం ఉన్న దశలో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి రైబకినా 4-3 పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తన సర్వీసును, చివరి సర్వీసును కూడా నిలుపుకొని విజేతగా నిలిచింది. దీంతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడింది. సబలెంకా 2024లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచినా.. 2025 తుది పోరులో మాడిసన్‌ కీస్‌(అమెరికా) చేతిలో, ఈసారి రైబకినా చేతిలో ఓడి రన్నరప్‌లకే పరిమితమైంది. దీంతో కెరీర్‌లో మూడో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుందామనుకున్న సబలెంకా ఆశలు అడియాశలయ్యాయి. విజేతగా నిలిచిన రైబకినాకు భారత కరెన్సీలో సుమారు రూ.26కోట్లు, రన్నరప్‌గా నిలిచిన సబలెంకాకు రూ.13కోట్లు దక్కాయి.

నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌..
పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా), స్పెయిన్‌ యువ సంచలనం, టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది. 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచి రికార్డు నెలకొల్పిన నొవాక్‌ జకోవిచ్‌.. 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. అతడికి ఫైనల్లో స్పెయిన్‌ యువ ఆటగాడు, టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ రూపంలో గట్టి ప్రత్యర్ధి అడ్డుగా నిలిచాడు.

అతడిని ఓడించాలంటే జకోవిచ్‌ చెమటోడ్చాల్సిందే. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో వీరిద్దరూ ఐదుసెట్ల హోరాహోరీ పోటీలో ప్రత్యర్థులను చిత్తుచేసి ఫైనల్‌కు చేరారు. జకోవిచ్‌ 3-6, 6-3, 4-6, 6-4, 6-4తో 2వ సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ను ఓడించగా.. అల్కరాజ్‌ 6-4, 7-6(7-5), 6-7(3-7), 6-7(4-7), 7-5తో 3వ సీడ్‌, జర్మనీకి చెందిన జ్వెరేవ్‌ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ సుమారు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘ పోరాటం జరిగింది. జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఏకంగా 10సార్లు చేజిక్కించుకోగా.. చివరిసారిగా 2023లో విజేతగా నిలిచాడు. మరోవైపు అల్కరాజ్‌ కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -