‘జగమంత కుటుంబం’ కథల పుస్తకంలో మొత్తం పన్నెండు ఆణి ముత్యాల్లాంటి నేటి సమాజానికి పనికొచ్చే అద్భుతమైన కథలను రచయిత్రి తన అనుభవసారం నుండి సమాజం లోతులకు వెళ్లి ఆచితూచి రాసిన అక్షరాల సమాహారంగా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఏకబిగిన చదివించిన మంచి పుస్తకం ఇది. కథల్లోకి వెళితే ‘క్షమాచాయ’లో ఒక దొంగను మార్చడానికి ఆ దొంగ కొడుకును దత్తత తీసుకుని మానవత్వం చూపించిన ‘కొండా’ లాంటి వారు సమాజానికి ఎంత అవసరమో చెప్పారు.
‘మెరుపు ఎప్పుడూ ఒక సరళరేఖలా భూమిని తాకదు – సమస్యలు కూడా అంతే కనిపించని మెలికలు మెరుపులో వున్నన్ని ఉంటాయి’ అంటూ మొదలయ్యే ‘అబ్బూ’ కథలో కులమతాలు ఏవైతేనేమి ప్రేమలు, బంధాలు, రాగద్వేషాలు, స్వార్థం మొదలైనవి కుటుంబంలో సమానంగానే ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య అనుబంధంతో పాటు కుటుంబ విలువలు, అసూయలు, పొరపొచ్చాలు ఎలా వుంటాయో తెలియజేస్తూ కథను తనదైన శైలిలో వినూత్నంగా ఆవిష్కరించారు. అలాగే ‘సమ్మయ్య’ కథలో సింగరేణి బొగ్గుగని కార్మికుల బండకింది బతుకులను వారి మనోభావాల్ని, కుటుంబ పరిస్థితులను, పని స్థలాలను, యాజమాన్య తీరుతెన్నులు, కార్మిక కష్టాలను క్లుప్తంగా అయినా కళ్ళకు కట్టినట్టుగా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం ప్రత్యేకంగా అనిపించింది.
కరోనా కాలంలో హాస్పటల్ వాతావరణంతో కూడిన ‘గ్రేస్’ కథలో అమ్మకు అనారోగ్య చికిత్సలో తోడుగా వున్న గ్రేసియానా సిస్టర్ సేవలను కొనియాడుతూ గాడి తప్పుతున్న ఆమె కొడుకు బాధను విని అర్థం చేసుకుంటూ సలహాలు సూచనలతో కథ నడుస్తుంది. మానవీయ కోణంలో సాగే ఈ కథ ‘అసలు మనలో సాయం చేసే గుణం ఉంటే అదే మనకు తిరిగి పడుతుందేమో…’ అంటూ మంచి సందేశంతో ముగుస్తుంది.
జీవితంలో ఎన్ని కష్టాలు, ఆవేశాలు, వేదనలు ఉన్నా, చీకటిగా అనిపించే ఏకాంతంలో కూడా తోడుగా ఒకరు (బౌతికంగా లేకపోయినప్పటికీ) ఉంటే అదొక గొప్ప భాగ్యమని అది జీవితానికి అసలైన ఆనందం రెండు మనసుల మధ్య మూగ ప్రేమలో సోమయ్య అనుభవాలతో కూడిన కథ ‘చీకటి మూసిన ఏకాంతంలో’.
టీనేజ్ కుర్రాళ్లలో అలజడి, వాళ్ళు తప్పటడుగులు వేయకుండా ఉండేలా వాళ్ళ చిరాకుకు ఓపికగా బాధ్యత వహించి సమాజం పట్ల మంచి చెడును అవగాహనా చేసుకునేలా ఓర్పుతో ప్రేమతో, సహనంతో కూడిన తల్లి పాత్ర ఒక సింగల్ పేరెంట్ (మదర్) అందులోను ఉద్యోగం చేస్తూ తల్లి బాధ్యతలను నెరవేర్చిన తీరుతెన్నులు కొడుకును సరిదిద్దుకోవడంలో ఆమె ఆలోచన విధానం లాంటివి ‘కాస్త విరామం’ కథలో వ్యక్తీకరించడం నేటి సమాజంలో ప్రతి పేరెంట్ కి అవసరం కూడా!
‘గనిలో… పనిలో’ కథ రిపీటేషన్ గా అనుకోవడానికి వీలు కల్పించకుండా ‘సమ్మయ్య…’ కథకు దీనికి పొంతన లేకుండా రెండు వేరు వేరు కథలు తెలంగాణ యాస, బాసలో రాసినవి సింగరేణి బొగ్గుగని కార్మికుల జీవిత వెతలకు దర్పణం లాంటివి!
‘అమ్మా… కూతురు’ కథలో స్త్రీకి కుటుంబం కల్పించే భద్రతనే కొన్నిసార్లు వికటించి ఆమెకు పంజరంగ మారుతుందన్న వాస్తవాన్నికథలో రచయిత్రి సహజంగా చూపించారు.
‘ఒక మనోజ్’ కథలో స్త్రీలు ఎదుర్కునే భావోద్వేగ, శారీరక, సామాజిక ఒత్తిళ్లు వాస్తవికంగా ప్రతిబింబించాయి. అలాగే పచ్చని పంట పొలాల నేపథ్యంలో పల్లెటూరు రైతు కుటుంబాల గురించి ‘బతుకు’ కథలో ‘బాధపెట్టే గతాన్ని, భయపెట్టే భవిష్యత్తు గురించి ఆలోచించనప్పుడే ఇష్టంతో కూడిన సవాలుగా ఉంటుంది జీవితం’ అన్న వాక్యాలు అక్షర సత్యాలు.
‘సావు డప్పు’ కథలో నిరుపేద కుటుంబాలు అనుకోని అవాంతరాలు ఎదురైనపుడు వాళ్ళ పిల్లల చదువులు అర్థాంతరంగా ఆగి పోవడానికి కారణాలు – అవి చదువు చెప్పే టీచర్లను ఎంతగా వేదిస్తాయో ‘పిల్లల చదువుకు ఈ దుర్మార్గపు సావు డప్పు ఒకటి’ మనసులో అనుకుంటూ ముందుకు సాగిన టీచర్ లాంటి వాక్యాలతో కథ ముగుస్తుంది.
‘కొంచెం దయ చూడు సారూ మా కష్టార్జితంలో నువ్వు వాటా అంటే ఎట్లా?’ చాపలు, పీతల వ్యాపారంలో దళారుల కమీషన్ల కక్కుర్తికి రాజీపడుతూ బతుకు వెళ్లదీస్తున్న మత్స వ్యాపారస్తుల దగ్గర పనిచేసే కార్మికుల జీవితాలకు నిదర్శనంగా ‘పనికొచ్చే ఎలాంటి కార్డులు లేకుండా కేవలం నీలిరంగు ప్లాస్టిక్ డేరాలో నివసించే ఈ జనం ఒక సావుకారి ఊడిగం నుండి ఇంకో సావుకారి ఊడిగం కోసం మరుసటి రోజు సిద్ధమయ్యారు’ అంటూ ‘ఎర’ కథతో ఈ కథా సంపుటి ముగుస్తుంది
ప్రతి కథలో భావోద్వేగాల లోతు, కుటుంబ సామాజిక ఒత్తిళ్లు, తీసుకున్న కథాంశానికి తగ్గట్టుగా ప్రాంతీయ బాష ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో కొన్ని నిశ్శబ్దంలో దాగిన స్త్రీల జీవన సత్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి అతిశయానికి పోకుండా సాధారణ ద శ్యాల ద్వారానే అన్ని వర్గాల పాఠకుల మనసుకు హత్తుకునేలా లోతైన భావోద్వేగాన్ని పండిస్తారు, సమస్యల పరిస్కారం, భయాల నుంచి విముక్తి మానవ సంబంధాల లోతును గుర్తు చేస్తాయి. నిశ్చలమైన భాషలో లోతైన భావాలతో ఆవిష్కరించిన కధాసంపుటి ఈ ‘జగమంతా కుటుంబం’ – ఇంతమంచి కథలను సమాజానికి అందించిన రచయిత్రి ‘శారద కావూరి’ గారికి అభినందనలు !
– న్యాలకంటి నారాయణ



