ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మన్నెగూడలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సంఘ రాష్ట్ర తృతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు నూతనంగా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలనీ, ఖాళీగా ఉన్న 600కు పైగా ఎంఈవో పోస్టులు, 80 డిప్యూటీ ఈవో క్యాడర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, దీంతో పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు.ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు సీపీఎస్ రద్దు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీయస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మోడల్, ఎయిడెడ్ పాఠశాలల టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో జీవో 190ని అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న కుల గణన సర్వే పారితోషికం, సీపీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ లో ఉన్న జిల్లా పరిషత్ జీపీఎఫ్ కు సంబంధించి వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలి సంఘ నివేదికలు సమర్పించారు. పలు తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది. రాష్ట్ర పూర్వ అధ్యక్షులు యం.పర్వత్ రెడ్డి, సంఘ మాస పత్రిక ఎడిటర్ ఎల్. యం. ప్రసాద్, రాష్ట్ర నాయకులు వై. కరుణాకర్ రెడ్డి, ఎ. వి. సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణా రెడ్డి, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.
జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



