బడ్జెట్ ఆమోదించని కాంగ్రెస్
ఏజెన్సీలకు నిలిచిన నిధులు విడుదల
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వం శనివారం పాక్షికంగా షట్‌డౌన్ అయింది. 2026 బడ్జెట్‌ను అర్థరాత్రి లోగా ప్రతినిధి సభ ఆమోదించాల్సి ఉండగా ఆ పని జరగకపోవడంతో ప్రభుత్వ నిధుల విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఈ పరిస్థితి కొద్ది కాలం మాత్రమే ఉంటుందని, సెనెట్ మద్దతు తెలిపిన బడ్జెట్‌కు ప్రతినిధి సభ వచ్చే వారం ఆమోదం తెలుపుతుందని శాసనకర్తలు తెలిపారు. మిన్నెయపొలిస్‌లో ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు ఇద్దరు నిరసన కారులను కాల్చి చంపడంపై డెమొక్రటిక్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బడ్జెట్‌పై చర్చలు విఫలమయ్యాయి.
హోమ్‌లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంటుకు (డీహెచ్‌ఎస్) కొత్తగా నిధులు సమకూర్చే విషయంపై జరుగుతున్న సంప్రదింపులకు బ్రేక్ పడింది. ఫెడరల్ ఏజెంట్ల ప్రవర్తనకు సంబంధించి కొత్తగా ఆంక్షలను చేరుస్తూ డీహెచ్‌ఎస్ ఫండింగ్ బిల్లును తిరగరాయాలని డెమొక్రాట్లు డిమాండ్ చేశారు. అది జరిగినప్పుడే నిధుల విడుదలకు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అయితే గడువు లోగా దీనిపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో అత్యవసరం కాని ప్రభుత్వ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇదిలావుండగా ప్రతినిధి సభలో బడ్జెట్ ఆమోదం పొందడానికి అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టేందుకు శాసనకర్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఏం జరుగుతుంది?
తాజా పరిణామాల నేపథ్యంలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం పడబోతోంది. విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, రక్షణ తదితర రంగాలకు సంబంధించిన ఏజెన్సీలకు నిధుల విడుదల ఆగిపోతుంది. ప్రతినిధి సభ వచ్చే వారం బడ్జెట్‌కు ఆమోదం తెలిపితే కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయా ఏజెన్సీలకు నిధుల విడుదల జరుగుతుంది. ఒకవేళ గతంలో మాదిరిగా షట్‌డౌన్ దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో వేలాది మంది ఉద్యోగులు సెలవుపై వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో వారికి జీతాలు ఇవ్వరు. లేదా నిధులు విడుదలయ్యే వరకూ జీతం తీసుకోకుండా పనిచేయాల్సి ఉంటుంది.



