రసవత్తరంగా ‘పుర’పోరు
బెంబేలెత్తుతున్న పార్టీలు
ముగిసిన నామినేషన్ల ఘట్టం
ప్రారంభమైన పరిశీలన
3వరకు ఉపసంహరణకు గడువు
‘బీ’ఫామ్‌లకోసం పోటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల్లో ఎన్నికలపోరు రసవత్తరంగా మారింది. పట్టణాలు పార్టీల ప్రచారార్భాటంతో హోరెత్తుతున్నాయి. ఇంకా కొన్ని పార్టీల్లో ‘బీ ఫారమ్’లు ఇవ్వకపోవడంతో, ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ప్రధానంగా అన్ని పార్టీల్లోనూ రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. వారిని బుజ్జగించి, నామినేషన్లు ఉపసంహరింపచేసేందుకు ప్రధాన అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల జిల్లా స్థాయి నేతలు రంగంలోకి దిగి, అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు గడవు పూర్తయ్యింది. శనివారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది.
ఉపసంహరణకు ఫిబ్రవరి 3వరకు గడువు ఉంది. ఈలోపు రెబెల్స్‌ను దారిలోకి తెచ్చుకొనేందుకు అన్నిపార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. పార్టీల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరికొందరు రెబెల్స్ నామినేషన్లు వేసి, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇక్కడే ఉంటే బుజ్జగింపులకు లొంగాల్సి వస్తుందని, ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా రెబెల్స్ పెద్ద సంఖ్యలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిశాక గెలిచిన వారంతా తిరిగి ఆయా పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఆయాపార్టీల అధిష్టానాలు కూడా వారంతా తమవారే అని ప్రకటించుకోవడం గమనార్హం. ఇప్పుడు కూడా ఇలాంటి రాజకీయ అవకాశవాదాన్ని వాడుకొనేందుకు రెబెల్స్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు బుజ్జగింపులకు మెత్తబడి, పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు సహకరిస్తామని హామీలు ఇస్తున్నారు.
ఎవరి వ్యూహాలు వారివే
రాజకీయపార్టీలు ఎవరి వ్యూహాల్లో అవి బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రైజింగ్ తెలంగాణ-2047 పేరుతో అభివృద్ధిని చూపించి, ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం అమెరికాలోఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 2న రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. అదేనెల 4వ తేదీన మిర్యాలగూడలో జరిగే ఎన్నికల ప్రచారసభతో సుడిగాలి పర్యటనకు షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణల పేరుతో కుంగిపోతున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం కూడా గత ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా 2020 జనవరిలో 120 మున్సిపాల్టీలు, 11 కార్పొరేషన్లు, 3,262 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 120 మున్సిపాల్టీల్లో 109 చోట్ల బీఆర్‌ఎస్ విజయం సాధించింది. అలాగే ఎన్నికలు జరిగిన అన్ని కార్పొరేషన్లనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆపార్టీ పరాజయాల్నే చవిచూసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగిన సంఖ్యలో అభ్యర్థుల్ని గెలిపించుకుంది. గత ప్రాభవాన్ని నిలుపుకోవాలంటే ఇప్పుడు బీఆర్‌ఎస్ శక్తిసామర్థ్యాలు సరిపోవనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీజేపీతో కొన్ని మున్సిపాల్టీలను బీఆర్‌ఎస్ పంచుకొనే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటిపొత్తుపై చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్టు అవుతుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గతంకంటే మెరుగైన స్థానాల్నే బీజేపీ సాధించింది. తెలంగాణలో బీజేపీ బలం పెరగడానికి బీఆర్‌ఎస్ పరోక్ష మద్దతే కారణమని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అవసరమైన చోట్ల వామపక్షాలతో పొత్తు కోసం తాపత్రయపడుతుంది. వామపక్షాలు తమకు బలమున్న ప్రాంతాల్లో వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ, సీట్లు సర్దుబాటు చేసుకొని బరిలోకి దిగుతున్నాయి.



