ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
నవతెలంగాణ-తాడ్వాయి
ఈనెల 28 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైన మేడారం మహా జాతర 31వ తేదీ (శనివారం)తో ముగిసింది. వివిధ గ్రామాల నుంచి మేడారం చేరుకున్న మహాదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు రెండు రోజుల పాటు మేడారం గద్దెలపై కొలువుదీరి నాలుగు రోజులు భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, శనివారం వీరు మళ్లీ వనంలోకి తరలివెళ్లడంతో జాతర ముగిసింది. సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లి, పగిడిద్దరాజు పూనుగుండ్ల కామారం, గోవిందరాజులు కొండాయి గ్రామానికి తరిలారు.
రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రాతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు వనదేవతలకు వీడ్కోలు పలికారు. ఈ నాలుగు రోజులు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మేడారం జనసంద్రమైంది. దేవతలు జనం నుంచి తిరిగి వనానికి చేరుకునే వేళ.. భక్తులు సైతం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా దేవతల పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.



