రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు
ఫలితం ఉండకపోవచ్చునంటున్న నిపుణులు
టెహ్రాన్ : అమెరికా దళాలు దాడి చేసే అవకాశాలు కన్పిస్తుండడంతో దౌత్య ప్రయత్నాలను ఇరాన్ ముమ్మరం చేసింది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ తప్పదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని నివారించేందుకు పలు దేశాలు… ముఖ్యంగా ఇరాన్ పొరుగున ఉన్న దేశాలు రంగంలోకి దిగి దౌత్య యత్నాలు ప్రారంభించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్తాంబుల్ చేరుకొని టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్, దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్లతో చర్చలు జరిపారు. చర్చల అజెండా ఏమిటో నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో సైనికపరమైన జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో కూడా అగార్చీ టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలన్న తమ వైఖరిని దార్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని తప్పుపడుతూ ఉగ్రవాదాన్ని ఖండించారు. మరోవైపు పాక్ ప్రధాని షెV్ాబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో సంభాషించారు. దౌత్య యత్నాలలో ఈజిప్ట్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు కూడా భాగస్వాములు అవుతున్నాయి. ఈజిప్ట్ సీనియర్ దౌత్యవేత్త అబ్దెలట్టీ రెండు రోజుల క్రితం అగార్చీతోనూ, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తోనూ విడివిడిగా మాట్లాడారు.
సైనిక చర్యలకు తన గగనతలాన్ని, భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతించబోనని సౌదీ అరేబియా ఇప్పటికే స్పష్టం చేసింది. యూఏఈ కూడా ఇదే భరోసా ఇచ్చింది. భారత జాతీయ భద్రతా సహాయ సలహాదారు పవర్ కపూర్ టెహ్రాన్ వెళ్లి అక్కడి నేతలతో చర్చించారు. నిరసనకారులపై ఇరాన్ అణచివేతను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి గత వారం ఆమోదించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని చైనా కూడా వ్యతిరేకించింది.
సైనిక చర్య సమస్యలను పరిష్కరించలేదని, అన్ని దేశాలు ఐరాస ఛార్టర్కు కట్టుబడి ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యాన్ని వ్యతిరేకించాలని ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి అయిన ఫ్యూ కాంగ్ ఓ చర్చ సందర్భంగా చెప్పారు. అమెరికా, చైనా మధ్య చర్చలకు అవకాశాలు ఉన్నాయని రష్యా అభిప్రాయపడింది. సంయమనం పాటించాలని, సమస్యల పరిష్కారానికి బలప్రయోగానికి దిగవద్దని అన్ని పక్షాలనూ కోరింది. కాగా యుద్ధ నివారణకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు పరిమిత ప్రభావం మాత్రమే చూపుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ యత్నాలు అమెరికా నిర్ణయాలను మార్చకపోవచ్చునని వారు తెలిపారు. ట్రంప్ ఎవరి మాట వినరని, అంతిమంతా తాను అనుకున్న పనే చేస్తారని వ్యాఖ్యానించారు.



