Sunday, February 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆర్థిక పతనం దిశగా ఐరాస

ఆర్థిక పతనం దిశగా ఐరాస

- Advertisement -

బకాయిలు చెల్లించండి : సభ్యదేశాలకు సెక్రటరీ జనరల్‌ గుటెర్రెస్‌ వినతి

న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితి పతనం దిశగా అడుగులు వేస్తోందని ఆ సంస్థ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ హెచ్చరించారు. తక్షణమే ఆర్థిక నిబంధనలను ప్రక్షాళన చేయాలని, 193 సభ్యదేశాలు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని అంటూ లేనిపక్షంలో అంతర్జాతీయ సంస్థ పతనం తప్పదని ఆయన తెలిపారు. ప్రధానంగా అమెరికాను ఉద్దేశించి గుటెర్రెస్‌ ఈ సందేశాన్ని ఇచ్చినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే ఐరాస రెగ్యులర్‌ బడ్జెట్‌కు అమెరికా 2.196 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దీనికి తోడు ఈ ఏడాది 767 మిలియన్‌ డాలర్లు బకాయి పడింది. వివిధ దేశాల బకాయిలు పేరుకుపోతున్న నేపథ్యంలో సభ్యదేశాలకు గుటెర్రెస్‌ లేఖ రాస్తూ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం చేతిలో ఉన్న సొమ్ము జూలై నాటికి అయిపోతుందని తెలియజేశారు. నగదు నిల్వలు అడు గంటితే కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘సభ్యదేశాలన్నీ తమ కర్తవ్యాన్ని గౌరవించి బకాయిలను పూర్తిగా, సకాలంలో చెల్లించాలి. లేదా సభ్యదేశాలు నిబంధనలను ప్రక్షాళన చేసి ఆర్థిక పతనాన్ని నివారించాలి’ అని గుటెర్రెస్‌ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆయన తన లేఖలో ఏ దేశం పేరునూ ప్రస్తావించనప్పటికీ అతి పెద్ద దాతగా ఉన్న అమెరికా తన బకాయిలను చెల్లించకపోవడం వల్లనే ఆర్థిక సంక్షోభం తలెత్తిందని రాయిటర్స్‌ గతంలోనే తెలిపింది. బకాయిలతో పాటు ఐరాస చేపడుతున్న శాంతి పరిరక్షణ కార్యకలాపాల నిమిత్తం కూడా అమెరికా 1.8 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. బకాయి పడిన దేశాల జాబితాలో అమెరికా తర్వాతి స్థానం వెనిజులాదే. ఆ దేశం 38 మిలియన్‌ డాలర్లు బకాయి పడింది.

గత సంవత్సరం చివరి నాటికి ఐరాసకు రావాల్సిన మొత్తం బకాయిలు 1.568 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయని గుటెర్రెస్‌ తెలిపారు. 2024 చివరి నాటికి ఉన్న బకాయిలతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ మొత్తమే. ట్రంప్‌ ప్రభుత్వం గత సంవత్సరంలో దమ్మిడీ కూడా ఇవ్వలేదు. రావాల్సిన బకాయిలు కొండలా పేరుకుపో తుంటే ఐరాస లిక్విడిటీ నిల్వలు ఆవిరైపోతు న్నాయి. చెల్లింపుల పరిస్థితి మెరుగుపడని పక్షంలో ఐరాస 2026వ సంవత్సరపు 3.45 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ హామీలను నెరవేర్చలేదని గుటెర్రెస్‌ చెప్పారు. చెల్లింపుల రూపంలో డబ్బు రాకపోయినప్పటికీ బడ్జెట్‌ నుంచి ఖర్చు చేయని సొమ్మును సభ్యదేశాలకు వాపసు చేయాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -