Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి

- Advertisement -

తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల దుస్థితి
బూసేకరణపై దృష్టిపెట్టని కేంద్రం
మౌళిక సదుపాయాల కల్పనలో అలసత్వం
నేటి కేంద్ర బడ్జెట్‌తో ప్రయోజనమెంతో..!?


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా ఉంది. విపరీతమైన జాప్యం మూలంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. ప్రాజెక్టులు మంజూరవుతున్నా వాటిని కార్యాచరణలోకి తెచ్చి, ప్రయాణీకుల అవసరాలు తీరేలా చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రానికి రూ. 35 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశామనీ ఒకవైపు మోడీ సర్కారు చెబుతున్నది. అదే సందర్భంగా వేగంగా వాటిని అమల్లోకి తేవడంలో మాత్రం వెనకపడుతున్నది. దాదాపు 20 ప్రాజెక్టులకు 600 ఎకరాల భూమిని సేకరించడంలో ఆలస్యం మూలానా ఆ ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కొత్త లైన్లతోపాటు డబ్లింగ్‌ చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. భూసేకరణ జరగకపోవడంతో తెలంగాణలో పలు ప్రాజెక్టులకు మోక్షం కలగడం లేదు.

మనోహరాబాద్‌-కొత్తపల్లి కొత్త రైల్వే లైన్‌ 31 కిలోమీటర్ల మేర భూమి అవసరం. సిద్ధిపేట, సిరిసిల్ల మధ్య ఇది జరగాల్సి ఉంది. రాష్ట్రవాటా నిధులు ఇవ్వకపోవడంతో ఇది పెండింగ్‌లో పడినట్టు సమాచారం. కాజీపేట- విజయవాడ మూడో లైన్‌ వరంగల్‌ రూరల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భూమిని సేకరించడంలో ఆలస్యంగా కారణంగా 219.64 కిలోమీటర్ల నిర్మాణానికి ఆటంకమేర్పడింది. బీబీనగర్‌-గుంటూరు డబ్లింగ్‌ సైతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. యాదాద్రి-భువనగరితోపాటు నల్లగొండ జిల్లాల్లో 150 ఎకరాలకు పైగా భూమిని సేకరించకపోవడంతో ఈ ప్రాజెక్టు తీవ్ర ఆలస్యమవుతున్నది. మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్త లైన్‌ భూసేకరణ అడ్డంకులు కారణంగా నిలిచిపోయింది. డోర్నకల్‌-మిర్యాలగూడ, రామగుండం-మణుగూరు, కరీంనగర్‌-హసనపర్తి, పటాన్‌చెరు-ఆదిలాబాద్‌ లైన్లతో సహా పలు ప్రాజెక్టు పనులు భూమి అందుబాటులో లేకపోవడంతోపాటు అనుమతులు, నిధుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన సవాల్‌గా మారింది.

చర్లపల్లి టర్మినల్‌ను కొత్త ఉపగ్రహ టెర్మినల్‌గా మార్చాలంటే మెరుగైన అప్రోచ్‌ రోడ్లు లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవసరమైన మౌళిక సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం లేక కష్టాలు కొనసాగుతున్నాయి. రోడ్డు ఓవర్‌ బ్రీడ్జీ(ఆర్‌వోబీ), రోడ్డు అండర్‌ బ్రిడ్జీ(ఆర్‌యూబీ)ల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తరహాలో దాదాపు 50 బ్రీడ్జీలు ఇంకా పునాదులు సరికదా పరిపాలన అనుమతులే రాలేదు. హైదరాబాద్‌-మౌలాలీ యార్డులకు సమీపంలో ఉన్న భారీ ట్రాఫీక్‌ ప్రాంతాలు వర్షాకాలంలో ట్రాక్‌ వరదల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. డ్రైనేజీ సమస్యలు తప్పడం లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు, కేంద్ర అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా అడుగులు ముందుకు పడటం లేదు. కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ దీర్ఘకాలికంగా పెండింగ్‌లోనే ఉండటం తెలిసిందే. ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు వెంట రింగ్‌ రైల్‌ కోసం సర్వేలు, ప్రణాళికలు ప్రారంభదశలో ఉన్నాయి.

వేగంగా ఆ ప్రక్రియ పూర్తికావడం లేదు. రైల్వేల్లో విద్యుదీకరణ జరుగుతున్నా, ఆధునిక ట్రాఫిక్‌ డిమాండ్లు ముందుకొస్తున్నాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 40 స్టేషన్లల్లో పనులు కొనసాగుతున్నా, కొన్ని షెడ్యూల్‌ కంటే వెనుకపడినట్టు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు ఫ్యాసింజర్‌ రైళ్ల సంఖ్య పెంచాల్సిన అవసరం కనిపిస్తున్నది. అటవీ అనుమతులు రాకపోవడంతో కిలోమీటర్ల తరబడి పనులు ఆగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో రైల్వేల అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. సమయానుకూలంగా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వాటాలను సమకూర్చడంలో ఒకింత వెనుకబాటు కనిపిస్తున్నది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ది పనులు పూర్తికావడానికి ఆటంకంగా మారుతున్నది. అటవీ అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న తీవ్రమైన జాప్యంతో రైల్వే పనులు తీవ్ర ఆలస్యమవుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -