గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి
ఘాట్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించండి
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
తెలంగాణ విజన్-2047కు అనుగుణంగా పనిచేయాలి : అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు ఆదేశించారు. వచ్చే ఏడాది జరిగే గోదావారి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు తగు ప్రణాళికలను సిద్ధం చేయాలని కోరారు. గోదావారి నది తీరంలో దాదాపు 69 ప్రాంతాల్లో 74 పుష్కర ఘాట్లను గుర్తించామని అధికారులు వివరించారు. త్వరితగతిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి తగు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు విజన్-2047 లక్ష్య సాధనలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, రవాణా, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న అభివద్ధి పనులు, భక్తులకు అందిస్తున్న వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రసాదాల పంపిణీ, రవాణా సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ యాదగిరిగుట్ట, వేములవాడ, భక్తుల రద్దీ ఉండే ఇతర ఆలయాల్లో దర్శన క్యూల నిర్వహణ, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత నిర్వహణను మరింత మెరుగుపర్చాలని సూచించారు. హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్ శాఖల ద్వారా చేనేత కళాకారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించాలని కోరారు.
భూ భారతి రికార్డుల నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, భూ సర్వేలు, సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయ భవనాల నిర్మాణం, ఈ-ఫైలింగ్, లైసెన్స్ సర్వేయర్లు, విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యసాధనపై సమీక్షించామని అన్నారు. రాబోయే 2036 ఒలింపిక్స్ నాటికి రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడాకారులను అధిక సంఖ్యలో తయారు చేసే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047లో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామనీ, క్రీడల అభివృద్ధికి యువతను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల వైపు మరింత ఆకర్షించే విధంగా విధానాలను రూపొందిం చాలని కోరారు.
యువజన సర్వీసుల శాఖ ద్వారా అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణ, యువత సంక్షేమ కార్యక్రమాలు లక్ష్య సాధనలో ఉండేలా పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. యువతలో క్రీడా ప్రతిభను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రోత్సహించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వారికి అందిస్తున్న శిక్షణ, కోచింగ్ సదుపాయాలు, ప్రోత్సాహకాలు, అవార్డులు, ఆర్థిక సహాయంపై సమీక్ష జరిపి ప్రతిభావంతులైన వారిని మరింత ప్రోత్సహించాలని అన్నారు. సీఎం కప్ వాట్సాప్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించాలని చెప్పారు.
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి ఆర్థిక వృద్ధికి కీలకమనీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అనుసంధానించే రహదారుల పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో చేపట్టిన పలు ప్రభుత్వ ఆస్పత్రులు వరంగల్, ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్, న్యూ ఉస్మానియా, హైకోర్టు నూతన భవనం, భవన నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కోరారు. రవాణా శాఖకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించాలని సూచించారు. వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సులు, రహదారి భద్రత చర్యల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
రహదారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు మరింత బాధ్యతతో పనిచే యాలని సీఎస్ ఆదేశించారు. పథకాల అమల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పారదర్శకతను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ కుమార్ సుల్తా నియా, ఎన్ శ్రీధర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తీ, సెర్ప్ సీఈఓ దివ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శృతి ఓఝా, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతు, దేవాదాయశాఖ డైరెక్టర్ ఎస్ హరీశ్, స్పోర్ట్స్ వీసీ, ఎండీ సోనిబాలా దేవి, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



