ఇద్దరు అరెస్ట్
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై శనివారం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాలతో దాడులు నిర్వహించి, కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారీ జరుగుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎండీ అన్వార్ పాషా టీమ్, అధికారులు దాడి నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్ విష్ణు, హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన మొహమ్మద్ సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన కల్తీ కోవాతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తాండూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తాండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.



