– నందినగర్ ఇంట్లో ఏర్పాట్లు చేసుకున్న సిట్
– ఇంటి పరిసరాల్లో భారీ బందోబస్తు
– కేసీఆర్‌కు వేసే ప్రశ్నలపై సిట్ హౌంవర్క్
– బీఆర్‌ఎస్ నిరసనల ప్రకటనలు
– అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
– కీలక దశకు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ విచారణకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో కేసీఆర్‌ను విచారించడానికి సిట్ చీఫ్, నగర పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం సర్వం సిద్ధం చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ను విచారించడానికి అవసరమైన దర్యాప్తు పరికరాలను నందినగర్‌కు సిట్ దర్యాప్తు అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి పర్యవేక్షణలో తరలించారు.
రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు సంబంధిత ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, బుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను విచారించిన సిట్ అధికారులు.. అనంతరం బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్‌రావులను విచారించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేండ్లుగా కొనసాగుతోన్న ఈ కేసు విచారణ క్రమం పలు మలుపులు తిరిగింది. ఇక చివరగా బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను విచారించడానికి సిట్ సమాయత్తం కావడంతో ఎలాంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకోనున్నాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఒకపక్క ఈ కేసును కేవలం రాజకీయ కక్షతో, పలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రగా బీఆర్‌ఎస్ పక్షం ఆరోపిస్తుండగా, ఫోన్‌ట్యాపింగ్ అనేది హేయమైన నేరమనీ, మనిషి వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను హరించేదనీ, అలాంటి నేరాలకు పాల్పడ్డవారిని ఎవ్వరిని కూడా వదలబోమని మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఆరువేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారనీ, అందులో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జడ్జిలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు ఉన్నారని సిట్ అధికారిక వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌ట్యాపింగ్ జరపడానికి గల కారణాలు, అందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడ్డ అధికారులు ఎవరు… మొదలైన కోణాల్లో దర్యాప్తును సాగించిన సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్‌ను జరపడానికి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కీలకమైన కోణంపై దృష్టిని సారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కేసీఆర్ విచారణ కీలక ఘట్టానికి తెరలేపే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఫోన్‌ట్యాపింగ్ జరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటంతో ఆయన తెలియకుండా ఈ వ్యవహారం జరగే అవకాశమే లేదని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఈ కేసులో అరెస్టయిన నిందిత పోలీసు అధికారులు దాదాపుగా ఇది ‘పెద్దాయన’కు తెలిసే జరిగిందంటూ ఇచ్చిన వాంగ్మూలాలు దర్యాప్తు అధికారులకు ఆధారాలుగా మారాయని తెలుస్తోంది. మరోవైపు పదవీవిరమణ చేసిన ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత కీలకమైన ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించడానికి గల కారణాలను కూడా ఈ విచారణలో కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశముందని తెలిసింది. నిజానికి పదవీ విరమణ చేసిన అధికారిని ఈ పోస్ట్‌లో నియమించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ తమ స్వార్థ రాజకీయ లాభాపేక్షతో ప్రభాకర్‌రావును నియమించుకున్నారనే ఆరోపణల నిగ్గును కూడా సిట్ అధికారులు తేల్చనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ సంతోశ్‌రావు ద్వారా అప్పటి ఎస్‌ఐబీ అధికారులతో కొన్ని రాజకీయ పరమైన పనులను కేసీఆర్ చేయించుకున్నారనే ఆరోపణలపై కూడా సిట్ అధికారులు ఆరా తీయనున్నట్టు తెలిసింది.
మొత్తమ్మీద కీలక దశకు చేరుకున్న కేసీఆర్ విచారణ అంకంలో తన ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీలుగా, హౌం శాఖ కార్యదర్శులుగా పని చేసిన అధికారులను కూడా ప్రశ్నించాలని కేసీఆర్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ధురంధుడైన కేసీఆర్‌ను ప్రశ్నించే సమయంలో తాము కూడా ఎలాంటి పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్న సిట్ అధికారులు ఆయనకు వేసే ప్రశ్నలపై ఒకటికి రెండుమార్లు చర్చించుకొని ప్రశ్నావళిని రూపొందించినట్టు సమాచారం. అలాగే కేసీఆర్‌ను విచారించే బృందంలో నగర స్పెషల్‌బ్రాంచ్ జాయింట్ కమిషనర్ విజరుకుమార్, కూకట్‌పల్లి డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ్‌రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్, అదనపు ఎస్పీ ఎ.ఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిలు ఉంటారని తెలిసింది. వీరి విచారణను స్వయంగా సజ్జనార్ పర్యవేక్షించనున్నారు.
నందినగర్ వద్ద భారీ బందోబస్తు
బీఆర్‌ఎస్ చీఫ్‌ను సిట్ విచారించనున్న నేపథ్యంలో నందినగర్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. కేసీఆర్ నివాసం వద్దకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకునే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఆ మార్గంలోని చౌరస్తాల వద్ద బారీకేడ్‌లతో పాటు సాయుధ పోలీసులతో పహారాను ఏర్పాటు చేస్తున్నారు. అదేసమయంలో నందినగర్ నివాసంలోకి దర్యాప్తు అధికారులతో పాటు ముందుగా అనుమతి తీసుకున్నవారినే లోనికి అనుమతించేలా కట్టుదిట్టమైన ఆదేశాలను కమిషనర్ సజ్జనార్ జారీ చేశారు. మరోవైపు కేసీఆర్ విచారణను నిరసిస్తూ ఆ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి అప్రమత్తం చేశారు. కేసీఆర్ విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై ముగిసేంత వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.



