ముఖ్యమంత్రికి సీపీఐ(ఎం) బహిరంగ లేఖ
ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే.. : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో ఉద్యోగులు, అధికారుల అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని, ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్లే అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి విషయంపై శనివారం యాదరగిరిగుట్టలో ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. కొంతకాలంగా దేవస్థానంలో కొందరు ఉద్యోగులు, అధికారులు నగదుగా వచ్చిన విరాళాలు, బంగారం, వెండి, నిత్యావసర సరుకులను మాయం చేస్తున్నట్టు అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. విచారణలో కొన్ని వాస్తవాలు కూడా తేలాయని చెప్పారు. సందర్శకులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వరుసగా అవినీతి విషయాలు బయటపడటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.
ఈ మధ్యకాలంలో సందర్శకులు సమర్పించిన బంగారు, వెండి, నర్సింహాస్వామి ప్రతిమతో తయారు చేసిన లాకెట్(డాలర్), డాలర్స్ విక్రయాల్లో అవకతవకల వల్ల సుమారు రూ.10 లక్షల అవినీతి జరిగిందని ఆడిట్ విచారణలో బట్టబయలైందన్నారు. ఏఈఓ పర్యవేక్షణలో జరగాల్సిన డాలర్ల విక్రయంలో ఇతరుల ప్రమేయంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయన్నారు. గతంలో కూడా చింతపండు, నెయ్యి దొంగతనం జరిగిందని ఫిర్యాదులందగా.. కొందరిని పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఇందులో అసలు దొంగలు బయటపడలేదని చర్చ కూడా ఉన్నదని తెలిపారు. ప్రతిరోజూ వేలాది మంది దేవస్థానాన్ని సందర్శిస్తుంటారని, తమ మొక్కు తీర్చుకోవడం కోసం కానుకలు సమర్పిస్తారని చెప్పారు.
వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొంతకాలంగా అధికారులు ఉద్యోగులు, కుమ్మక్కై యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతుంటే.. పైపై చర్యలు తీసుకుంటూ నామమాత్రంగా కొందరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రజల నమ్మకాన్ని నిలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ఉన్నత అధికారులతో సంపూర్ణ విచారణకు ఆదేశించాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, ఈశ్వర్రెడ్డి, షేక్ ఉస్మాన్ షరీఫ్, సీసా శ్రీనివాస్, నల్ల మల్లయ్య, నల్ల జానీ, శ్రీశైలం నగేష్ అనిల్ తదితరులు ఉన్నారు.



