– తెలంగాణ కొట్లాడి తెచ్చిన కేసీఆర్ పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు
– మేడారం జాతర వైఫల్యాన్నీ కప్పిపుచ్చేందుకు కేసిఆర్ కు సిట్ నోటీసులు
– మండలంలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పాలన చేతగాక ప్రతిపక్షాలపై కుట్రలకు పాల్పడుతూ తెలంగాణ కొట్లాడి తెచ్చిన కేసీఆర్ పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. మేడారం జాతర వైఫల్యాన్నీ కప్పిపుచ్చేందుకే కేసిఆర్ కు సిట్ నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అడ్డుకోవడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ పాలన చేతకాక, అటకెక్కిన ఆరు గ్యారంటీలు ప్రశ్నించే ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు.కేసుల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. అంతకుముందు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, నాయకులు గడ్డం స్వామి, మైలారం సుధాకర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



