జిల్లా కన్వీనర్ మైదం రవి
నవతెలంగాణ – పరకాల
రాబోయే పరకాల మున్సిపల్ ఎన్నికల యుద్ధంలో అగ్రకుల పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలను ఢీకొట్టి, పరకాల గడ్డపై ధర్మ సమాజ్ పార్టీ (డిఎస్ పి) విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మైదం రవి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పరకాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మైదం రవి అగ్రకుల పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికల్లో గెలవడానికి అగ్రకుల పార్టీలు కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లడానికి సిద్ధమయ్యాయని, ఆ ధన బలాన్ని ప్రజా బలంతో అడ్డుకుంటామని హెచ్చరించారు. పరకాల మున్సిపాలిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు.అగ్రకుల పార్టీల అసమర్థ పాలనకు, దోపిడీకి ఈ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని, బహుజనుల పార్టీగా డీఎస్పీ అజేయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు చుక్క రత్నాకర్, జిల్లా కోశాధికారి కొట్టే యేసేబు, మండల అధ్యక్షులు బొచ్చు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కోడపాక ప్రతాప్, ఎల్లస్వామి, సురేష్, భాస్కర్, తిరుపతి, విష్ణు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.



