Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంకార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్‌

కార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్‌

- Advertisement -

ప్రజలకు, రాష్ట్రాలకు వ్యతిరేకం : సీపీఐ(ఎం) తీవ్ర విమర్శ

న్యూఢిల్లీ : కార్మికులను, సమాజంలో సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలను, అలాగే దేశ విస్తృత ఆర్థిక ప్రయోజనాలను పణంగా పెట్టి కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు, కుబేరుల సంకుచిత ప్రయోజనాలను పెంచి పోషించేందుకు మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న రాజీలేని నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఘనతగా నిర్మలా సీతారామన్‌ ఎప్పుడూ చెబుతూ వచ్చే ‘ఆర్థిక క్రమశిక్షణ’ అనేది కార్మికుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన వ్యయాలను కుదిస్తూ, మరోపక్క కార్పొరేట్‌ రంగానికి, సంపన్నులకు ఇస్తున్న పన్ను రాయితీలకు పర్యాయపదం తప్ప మరొకటి కాదని పేర్కొంది. పెద్ద మొత్తంలో ఆదాయాల్లో క్షీణత ద్వారా, అలాగే వ్యయాలను తగ్గించడం ద్వారా ఇది ప్రస్తుత సంవత్సరంలోనూ, రాబోయే సంవత్సరానికి బడ్జెట్‌లోనూ వ్యక్తమైంది.

ఆదాయ పన్నులు, జీఎస్టీ రాబడుల ద్వారా వచ్చే ఆదాయాల్లో క్షీణతను ఎక్సైజ్‌ సుంకాలు ప్రధానంగా చమురుపై ఎక్సైజ్‌ సుంకం పెంపు ద్వారా ప్రభుత్వం కొంతమేర పూడ్చుకోగలిగినప్పటికీ ప్రస్తుతం ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం 2025-26లో పన్ను ఆదాయాల సమీకరణ అనేది గతేడాది బడ్జెట్‌లో వేసిన ఒక మోస్తరు అంచనాల కన్నా చాలా తక్కువకు పడిపోయింది. ఆదాయాల్లో ఈ సంక్షోభాన్ని, పైగా ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా ఇది కనబరిచే ప్రభావం గురించి ఆర్థిక మంత్రి అస్సలు ప్రస్తావించలేదు. పైగా తాను ప్రకటించిన పన్ను ప్రతిపాదనల వల్ల ఆదాయాలపై పడే పర్యవసానాల గురించి కూడా ఆమె ప్రస్తావించకుండా వదిలివేశారు. అయితే 2026-27 సంవత్సరానికి వారు అంచనా వేసిన రెవిన్యూలు 2025-26 సంవత్సరానికి వేసిన బడ్జెట్‌ అంచనాలు దాదాపుగా ఒకేలా వున్నాయి. అంటే జాతీయ ఆదాయంలో రాబడి రూపంలో లభించే వాటా తీవ్రంగా క్షీణించిందని స్పష్టమవుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో, 2025-26, 2026-27ల్లో ఆర్థిక లోటును తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు గానూ వ్యయాల్లో కోతలు పెట్టడంపై ప్రధానంగా ఆధారపడాల్సి వచ్చింది. రైతులు, కార్మికులపై అత్యంత దారుణమైన రీతిలో జరుగుతున్న దాడుల ద్వారా ఈ లక్ష్యం సాధించబడుతోంది. 2025-26 బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే అనేక కేంద్ర, కేంద్ర ప్రాయోజిత పథకాలైన రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, పీఎం పోషణ్‌, పీఎం-శ్రీ, పీఎం-జెఎవై, పీఎం-ఎంఎస్‌వై, పీఎంఎఐ (గ్రామీణ, పట్టణ), పంటల బీమా పథకం తదితరాలకు ఖర్చు చేసే మొత్తాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, ఈశాన్య ప్రాంతాలకు కేటాయింపుల్లో కూడా కోతలు విధించారు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు, గ్రామీణాభివృద్ధికి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాలకు చేసే కేటాయింపుల్లో కూడా కోతలు పడ్డాయి. లింగ సమానత్వం సాధన కోసం కేటాయించే బడ్జెట్‌లో రూ.51,144కోట్ల మేర కోత విధించారు.

రాబోయే సంవత్సరం 2026-27లో ఎరువులు, ఆహారం, పెట్రోలియం సబ్సిడీల్లో మరిన్ని కోతలకు ప్రతిపాదించారు. వ్యవసాయ రంగం ప్రతికూల ద్రవ్యోల్బణ పరిస్థితులను లేదా ఉత్పత్తి చేసిన వస్తువులకు లభించే ధరలు తీవ్రంగా కుప్పకూలుతున్న పరిస్థితులను ఎదుర్కొంటోందంటూ ప్రభుత్వ డేటానే పేర్కొంటున్న తరుణంలో ఇది ప్రత్యేకంగా ఆ రంగంపై దాడి అని వేరే చెప్పనవసరం లేదు. మూలధన వ్యయం పెరుగుతుందని బాగా ప్రచారం జరిగినప్పటికీ దాంట్లో కూడా వ్యయ కోతలు .జరిగాయి. దీంతో 2025-26 సంవత్సరానికి సవరించిన అంచనాలు బడ్జెట్‌లో కేటాయించిన వాటికన్నా తక్కువగా వున్నాయి. మరోవైపు, ప్రభుత్వ సంస్థల వనరుల ద్వారా చేసే మూల ధన వ్యయాలు 2024-25 కన్నా 2025-26లో తగ్గాయి. 2026-27లో కూడా తక్కువగానే వుంటుందని బడ్జెట్‌లో అంచనా వేయబడింది.

మోడీ ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే వాటి సామర్ధ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం నిధులు, ఇతర బదలాయింపుల ద్వారా రాష్ట్రాలకు జరిగే నిధుల బదిలీలు బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే 2025-26లో రూ.2,03,801 కోట్ల మేర కోత పడ్డాయి. 2025-26 బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే 2026-27 సంవత్సరానికి వేసిన బడ్జెట్‌ అంచనాలు రూ.59,456 కోట్ల మేరకు మరింత పడిపోయాయని తెలుస్తోంది. పేలవమైన జీఎస్టీ ఆదాయ రాబడులు, అలాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లో కొంత భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టడం ద్వారా వాటి వనరుల్లో కోత విధిస్తూ తీసుకువచ్చిన వీబీ-జీ ఆర్‌ఎఎం జీ పథకం వల్ల ఇప్పటికే రాష్ట్రాలు తీవ్రంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది.

మోడీ ప్రభుత్వ హయాంలో ‘సుస్థిరత, ఆర్థిక క్రమశిక్షణ, నిలకడగల వృద్ధి, ఒక మోస్తరు ద్రవ్యోల్బణం’ నెలకొన్నాయని ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. విశృంఖలంగా వున్న నిరుద్యోగ సమస్యతో, పని చేసినా వచ్చే పరిమితమైన ఆదాయాలతో కార్మికులు ఎదుర్కొంటున్న దుస్థితి ‘సుస్థిరం’గా వుందని ఆమె ప్రస్తావించలేదు. పైగా సంపన్నుల, కార్పొరేట్‌ రంగ ఆదాయాలు, వారి సంపద మాత్రమే ‘నిలకడగా వృద్ధి’ చెందుతున్నాయి అన్న అంశం గురించి ఆమె చెప్పలేదు. ఈ రకమైన అసమానతలు పెరుగుతుండడం వల్ల 2026-27 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరింత పెంచి పోషించేలా, బాగా రెచ్చగొట్టేలా వుండబోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల తలెత్తిన అంశాలపై కూడా అరకొరగా స్పందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -