తెలంగాణను విస్మరించిన బడ్జెట్
పేదలకు న్యాయం జరిగేలా సవరించాలి : జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణను విస్మరించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. బడ్జెట్లో అదనపు నిధుల కోసం కేంద్రంపై రాష్ట్ర సర్కారు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పేదలకు న్యాయం జరిగేలా బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్ప్పులు, వడ్డీలు కట్టాల్సి వస్తున్న విషయాన్ని ఎత్తిచూపారు. పని దినాలు పెంచామని గొప్పగా చెప్పుకుంటూ వీబీజీరాంజీ పథకానికి కేవలం రూ.93 వేల కోట్లు కేేటాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిధులను తగ్గించిందనీ, ఆ రంగాలకు గతంలో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చుపెట్టలేదని ఎత్తిచూపారు. ఆదానీ, అంబానీ తదితరులకు డేటా సెంటర్ల పేరుతో రాయితీలు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. చిన్న పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదని గుర్తుచేశారు. ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచకుండా నిరాశపర్చిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, ఎరువుల రాయితీలను విస్మరించడాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా రావలసిన నిధులు తగ్గించడాన్ని ఎత్తిచూపారు. పన్నుల వాటాలో 2.11 శాతం ప్రకారం రూ.63 వేల కోట్లు రావాల్సి ఉందనీ, గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. జీఎస్టీ పన్నుల వల్ల ఇప్పటికే రాష్ట్రాలు ఆర్ధికంగా సతమతమవుతుంటే పన్నుల వాటాను తగ్గించడం సబబు కాదని పేర్కొన్నారు.
పాలమూరు, రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హౌదా ఇవ్వాలనే డిమాండ్‌ను పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. హైదరాబాదు మెట్రో రైల్ విస్తరణకు నిధులు ఇవ్వలేదనీ, ఫార్మా రంగానికి అవసరమైన నిధులు కేటాయించలేదని వివరించారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవనీ, తెలంగాణ నుంచి 8మంది బిజేపి ఎంపీలు, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి తగిన నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. విద్యా, వైద్య రంగాలకు తక్కువ నిధులు కేటాయించడాన్ని తప్పుబట్టారు. సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీల ప్రయోజనాలను పక్కన బెట్టి కార్పొరేట్ ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడాన్ని తప్పుబట్టారు.



