Wednesday, May 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుక్వారీ మాటున భూ కబ్జా

క్వారీ మాటున భూ కబ్జా

- Advertisement -

పేదల అసైన్డ్‌భూములపై పెద్దల కన్ను
నయానోభయానో 
అందజేస్తూ కాజేత
ఇవ్వని రైతులపై బెదిరింపులు
పోలీస్‌ కేసులు పెడుతూ కోర్టుల చుట్టూ 
తిప్పుతున్న వైనం
రైతుల గోడును 
విస్మరిస్తున్న అధికారులు

వారంతా నిరుపేద రైతులు.. వారి కుటుంబ పోషణ కోసం నాటి ప్రభుత్వాలు అసైన్డ్‌భూములు ఇచ్చి వాటికి పట్టాలు సైతం అందజేశాయి. తాతల కాలం నుంచి వాటిని సాగుచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి రైతుల భూములపై బడా వ్యాపారుల కన్ను పడింది. వారి క్వారీల చుట్టుపక్కల ఉన్న ఆ భూములు కాజేసేందుకు కుయక్తులు పన్నారు. అసైన్డ్‌ భూములు కాబట్టి తాము చెప్పిన ధరకు ఇవ్వాలని లేకుంటే కబ్జాలు చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. వారితో కొట్లాడే శక్తి లేక.. దిక్కుతోచని పరిస్థితిలో పలువురు రైతులు భూములు అప్పగించారు. మరికొంత మంది రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీస్‌ కేసులు పెడుతూ, కోర్టులకు తిప్పుతూ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నట్టు పలువురు బాధిత రైతులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలోని సోమేశ్వర్‌, వాసుదేవపల్లి శివారుల్లో పలు క్వారీల నిర్వాహకుల ఆగడాలపై ప్రత్యేక కథనం.

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రెండు గ్రామాల శివారులో మైనింగ్‌ శాఖ అనుమతులతో ఐదు క్వారీలు కొనసాగుతున్నాయి. పలు క్వారీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన తవ్వకాలు చేపడుతూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆ నిర్వాహకులు బడా వ్యాపారవేత్తలు, నాయకులు కావడంతో కనీసం తనిఖీ చేసేందుకు సైతం అధికారులు వెనుకాడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో క్వారీల నిర్వాహకులు ఆ చుట్టుపక్కల ఉన్న భూములపై కన్నేశారు. క్వారీలకు 20 ఏండ్లపాటు అనుమతులు పొందడంతో.. ఇదే అదునుగా ఆ చుట్టుపక్కల గుట్టలు, భూములను కాజేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

వారు నిర్ణ‌యించిందే ధ‌ర‌..
గుట్టల చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అసైన్డ్‌ భూములు. ఏండ్ల కిందట నిరుపేద రైతులకు గత ప్రభుత్వాలు అందజేశాయి. పక్కనే నిజాంసాగర్‌ కాలువ పారుతుండటంతో ఏడాదికి రెండు పంటలు పుష్కలంగా పండుతాయి. సాధారణంగా సాగుభూములున్న చోట క్వారీలకు అనుమతులు ఇవ్వరాదు. కానీ ఇక్కడ మాత్రం యథేచ్ఛగా క్వారీలు కొనసాగుతుండటం గమనార్హం. ఒక్కో క్వారీకి హెక్టార్‌ (రెండున్నర ఎకరాలు) మాత్రమే అనుమతి ఉండగా.. క్షేత్రస్థాయిలో అంతకు మించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇందుకోసం చుట్టుపక్కల రైతుల భూములను క్రమంగా కొల్లగొడుతున్నారు. అసైన్డ్‌ భూములకు వారే ఒక ధర నిర్ణయించి రైతుల నుంచి క్రమంగా తీసుకుంటున్నారు. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలున్నాయి. వాసుదేవపల్లి శివారులో నలుగురు రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారిపై పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేయించారు. ప్రస్తుతం వారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తాము ఫిర్యాదు చేస్తే మాత్రం కేసు పెట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నట్టు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. సర్వే కోసం రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు చేస్తే.. ఐదు సర్వే నెంబర్‌లకుగాను నాలుగు నెంబర్‌లలోనే సర్వే చేపట్టి మరో సర్వే నెంబర్‌ను వదిలేస్తున్నారని వాపోతున్నారు. సోమేశ్వర్‌లో ఐదుగురి భూములను సైతం బలవంతంగా లాక్కున్నారని, తమ భూములకు వెళ్లనివ్వడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఒక్క రూపాయి పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.

రైతుల నుంచి లాక్కుని లీజ్‌
రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్న పలువురు.. వాటిని ఏకంగా లీజ్‌కు సైతం ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ హైవే పనులు కొనసాగుతుండగా.. సదరు కంపెనీకి క్వారీ నిర్వహించేందుకు అక్కడున్న ఓ కంపెనీ రైతుల భూములను లీజ్‌కు ఇవ్వడం గమనార్హం. హైవే పనులు చేస్తున్న కంపెనీ క్వారీ నిర్వహించేందుకు మైనింగ్‌ శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. రైతుల నుంచి తెల్లపేపర్‌ల మీద సంతకాలు తీసుకొని వారికి అప్పగించినట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

భూమి ఇవ్వబోమంటే 
కేసు పెట్టారు

మా తాతల కాలం నాటి నుంచి అసైన్డ్‌ భూమి ఉంది. వారసత్వంగా మా నాన్న పేరు మీద 3.19 ఎకరాలకు పట్టా ఉంది. ఈ భూమి ఆధారంగా మేం నలుగురం అన్నదమ్ముళ్లం ఆధారపడి జీవిస్తున్నాం. పక్కనే క్వారీ నిర్వహిస్తుండటంతో వారికి మా భూమిపై కన్నుపడింది. చుట్టుపక్కల రైతులవి తీసుకున్నారు. మా భూములు అడిగితే.. ఇచ్చేందుకు నిరాకరించాం. దీంతో మా నలుగురు అన్నదమ్ముల మీద క్వారీ నిర్వాహకుడు కేసు పెట్టాడు. భూమిలో దున్నుకు నేందుకు వెళ్తే కూడా పోలీసులను పంపు తున్నారు. ఇక్కడ భూమిని ఇచ్చి వేరే శిఖం భూము ల్లో సాగు చేసుకోవాలని బెదిరిస్తున్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ మా గోడు వినిపించుకోవడం లేదు.
​- గులుపల్లి శేఖర్‌- బాధిత రైతు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -