నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలకు కేటాయిపులు, ప్రకటనలు చేయకుండా కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందనీ, తెలంగాణను మరోమారు వంచించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టు జాతీయ హోదా, కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ప్రకటన డిమాండ్లను విస్మరించడాన్ని తప్పుబట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్య నిరుద్యోగం, ఆర్థిక అంతరాలకు సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి పేదలకు ఉపశమనం ఇవ్వకపోగా, కార్పొరేట్లకే అనుకూలంగా ఉన్నదని ఎత్తిచూపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటాను కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తమ పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపడం పట్ల రాష్ట్రం నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రజలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణను వంచించిన కేంద్ర బడ్జెట్ : కూనంనేని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



