ఎలినినోను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలి
రైతులకు భరోసా కల్పించే పంట ఆయిల్‌పామ్
రైతులు పంట అవశేషాలను కాల్చొద్దు : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి యూరియాను కూడా కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో అందించలేకపోతుందనీ, ఖరీఫ్ సీజన్ అవసరాల కోసం నవంబర్ నుంచి పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. యూరియా ఉత్పత్తి, రాష్ట్రాలకు సరఫరా చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందనీ, ఇక్కడేమో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పంట అవశేషాలను కాల్చే విధానాన్ని పూర్తిగా మానుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయం నుంచి రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల అవశేషాలను కాల్చివేస్తే నేలలోని సేంద్రియ పదార్థం పూర్తిగా నాశనమై భూసారం తగ్గిపోతుందనీ, నేలలోని సహజ పోషకాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. పంట అవశేషాలను భూమిలో కలియదున్నడం ద్వారా నేల సారం పెరుగుతుందనీ, సేంద్రియ శక్తి పెరిగి పంటలకు మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. దీని వల్ల యూరియా, పురుగుమందుల వినియోగం కూడా తగ్గుతుందన్నారు. ఇకపై ఎవరైనా రైతులు పంట అవశేషాలు కాల్చినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని, వాయు కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఉండవచ్చని తెలిపారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా పంట అవశేషాలు ఎక్కడ కాల్చుతున్నారో గుర్తించి, సంబంధిత రైతులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే జొన్న, మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులతో సంప్రదించి పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. ఎకరానికి నెలకు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశమున్న ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల సరఫరా విధానంలో కేంద్రం లోపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



