Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో పడకేసిన పారిశుధ్యం 

పరకాలలో పడకేసిన పారిశుధ్యం 

- Advertisement -

ఎన్నికల వేళ పాలకులపై ప్రజల ఆగ్రహం
నవతెలంగాణ – పరకాల 

మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగిన వేళ పట్టణంలో ‘అభివృద్ధి’ అన్నది ప్రధాన చర్చాంశంగా మారింది. ఏటా రూ. 6 నుండి 7 కోట్ల రూపాయల బడ్జెట్ కాగితాలపై కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైందని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ‘నవతెలంగాణ’ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో మున్సిపల్ యంత్రాంగం వైఫల్యాలు బాహాటంగా వెలుగులోకి వచ్చాయి.ముఖ్యంగా పరకాల మున్సిపాలిటీలో పారిశుధ్య సమస్య ఇప్పుడు పెను సవాలుగా పరిణమించింది.

పట్టణ ప్రణాళికలో అధికారుల వైఫల్యం, పాలకుల నిర్లక్ష్యం తోడై పట్టణం మొత్తం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఓట్ల కోసం వస్తున్న నాయకులకు గల్లీల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు, దుర్వాసన వెదజల్లుతున్న మురికి కాలువలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణంలోని అనేక కాలనీల్లో రోడ్లు ఊడ్చే సిబ్బంది జాడ కరువైందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వీధులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొన్నిచోట్ల సిబ్బంది ఊడ్చినప్పటికీ, ఆ చెత్తను అక్కడికక్కడే వదిలేయడంతో అది తిరిగి గాలికి కాలనీ అంతా విస్తరిస్తోంది. “ఊడ్చే దిక్కు లేదు.. ఊడ్చిన చోట ఎత్తే దిక్కు లేదు” అన్న చందంగా పరకాల పారిశుధ్యం తయారైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మరోవైపు మురుగు కాలువల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. సిఎస్ఐ కాలనీ, రాజిపేటతో పాటు పట్టణంలోని అనేక వార్డుల్లో కాలువలు పూడిక తీయక ఏళ్లు గడుస్తోంది. దీంతో మురుగు నీరు నిలిచిపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణమంతా దోమల రాజ్యాంగా మారడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల భయం కాలనీ వాసులను వెంటాడుతోంది. డ్రైనేజీలు నిండి మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో కాలనీవాసులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

మారుతున్న పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశుధ్య కార్మికుల కొరత ఉందా లేక పర్యవేక్షణ లోపమా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్య ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. ఎన్నికల వేళ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుందనేది పలువురి అభిప్రాయం. గెలుపే లక్ష్యంగా వివిధ సామాజిక సమీకరణాల కోసం ప్రయత్నిస్తున్న నేతలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈ మౌలిక సమస్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చారిత్రాత్మక పరకాలకు పూర్వ వైభవం, దళిత కాలనీల అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ, ప్రస్తుతం పారిశుధ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు సూచిస్తున్నారు.

పారిశుద్ధ్య సమస్యపై ఎవరికీ పట్టింపు లేదు: కానుగుల కేదారి పిట్టవాడ,13 వ వార్డు
“వార్డుల్లో మురుగు కాలువలు సరిగా లేక, ఉన్నవి పూడిక తీయక నరకం కనిపిస్తోంది. దోమల బెడదతో రాత్రుళ్లు నిద్రలేని గడుపుతున్నాం. అధికారులు మాత్రం బడ్జెట్ ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు తప్ప, మా కాలనీల్లో మార్పు మాత్రం రావడం లేదు. ఓట్ల కోసం వచ్చే నాయకులు ఈ సమస్యలకు సమాధానం చెప్పాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -