– జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ
– కమ్మర్ పల్లి, చౌట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. సోమవారం మండలంలోని చౌట్ పల్లి, కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాజరు సిబ్బంది హాజరు పట్టిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు అయినా కాన్పుల వివరాలతో కూడిన రికార్డులను, మహిళా ఆరోగ్య కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఆస్పత్రికి విచ్చేసిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులు, డెలివరీలకు సంబంధించిన డ్యూ లిస్ట్ వివరాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రయోగశాల (ల్యాబ్), ఫార్మసీ, లేబర్ రూమ్‌లను తనిఖీ చేసి అక్కడి సదుపాయాలపై సమగ్రంగా పరిశీలన చేశారు. టి-హబ్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలు, మందుల సరఫరా విధానం గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆస్పత్రికి విచ్చేసే రోగులకు మంచి సేవలందించాలని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరసింహ స్వామి, చౌట్ పల్లి వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



