– ముగ్గు వేసిన ఎమ్మెల్యే జారె
– చికెన్ కొట్టిన మాజీ ఎమ్మెల్యే తాటి
జబర్దస్త్ సెలబ్రిటీ ల హల్‌చల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మించి అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో అశ్వారావుపేట మున్సిపాలిటీ ఒక్కటే ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున మోహరించారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు లు దమ్మపేట నుంచి ప్రతిరోజూ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ ప్యానెల్ విజయానికి సోమవారం నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇంటింటా తిరుగుతూ ముగ్గులు వేస్తూ ఓటర్లను ఆకర్షించారు. ఐదో వార్డ్ లో కాంగ్రెసు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కొట్టే నాగ సునీత విజయాన్ని కాంక్షిస్తూ జబర్దస్త్ టీం నవీన్ (జూనియర్ రాఘవేంద్రరావు) చిట్టిబాబు లు ప్రచారం చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ విజయానికి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఛైర్పర్సన్ అభ్యర్థి కాసాని నాగశేషపద్మ తో కలిసి చికెన్ దుకాణంలో చికెన్ కొట్టి వినూత్న ప్రచారం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.


