– కూలీల నోట్లో మట్టికొట్టిన బీజేపీ సర్కార్
– ధనవంతుల కోసమే..మోడీ నిర్ణయాలు
– ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలి
– ‘వీబీజీ ఆర్‌ఏఎంజీ’ ని రద్దు చేయాల్సిందే లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తాం: ఇందిరాపార్కు వద్ద ధర్నాలో వక్తలు
నవతెలంగాణ-బ్యూరో హైదరాబాద్
గ్రామీణ పేదల పొట్టగొట్టి వికసిత్ భారత్‌ను నిర్మిస్తామంటూ గొప్పలు చెబితే ఎవరు నమ్ముతారని వక్తలు ప్రశ్నించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) యధాత థంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ హక్కుల పరిరక్షణ ఉద్యమం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉపాధి హామీ కూలీలు ధర్నా నిర్వహించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన జరిగిన. ధర్నాలో ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ఈ ధర్నాలో దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ, తెలంగాణ వ్యవసాయ వత్తిదారుల యూనియన్, స్వరభారతి, రైతు నేస్తం సంఘాలు, గ్రామ్య సంస్థ, ఒంటరి మహిళల సంఘం, రైతు స్వరాజ్య వేదిక, సఫర్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(ఎన్‌ఏపీఎం), మహిళా రైతుల హక్కుల వేదిక తదితర సంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రామలు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఉపాధి కూలీలకు ఒక చట్టబద్ధమైన హక్కును కల్పించిందని చెప్పారు. ప్రజలు పని కావాలని కోరితే, ప్రభుత్వం పని కల్పించాలి, లేదంటే పరిహారం చెల్లించాలనే హక్కు పాత చట్టంలో ఉందని గుర్తు చేశారు. మోడీ కొత్తగా తీసుకొచ్చిన వీబీజీఆర్‌ఏఎంజీలో పని హక్కు లేదని తెలిపారు. అది కేంద్రం ”దయాదాక్షిణ్యం”గా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పనిని నిషేధించారనీ, ఇది ఉపాధి హామీ భద్రతకు పూర్తి విరుద్ధమని విమర్శించారు. 125 రోజుల పని కల్పిస్తామనే వాగ్దానం పెద్ద అబద్ధమని ఎద్దేవా చేశారు. పాత చట్టం ప్రకారం వంద శాతం కూలీల వేతనాలు, 75శాతం మెటీరియల్ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందనీ, ఆచరణలో ఇది కేంద్రం, రాష్ట్రాల మధ్య 90:10 నిష్పత్తిలో ఉంటుందని తెలిపారు. కానీ కొత్త బిల్లులోని సెక్షన్ 22(2) ప్రకారం, ఈ నిష్పత్తిని ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు 90:10గా, మిగిలిన ఇతర రాష్ట్రాలకు 60:40గా మార్చారని చెప్పారు. దీంతో రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపిందని చెప్పారు. పేద, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరగడం వల్ల, కార్మికుల పని డిమాండ్‌ను నమోదు చేయడానికి వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ రకంగా కొత్త ఉపాధి చట్టంతో కూలోల్ల నోట్లో మోడీ ప్రభుత్వం మట్టికొట్టిందని విమర్శించారు. గ్రామీణ ధనవంతులు, పట్టణ ప్రాంత కార్పొరేట్ల కోసమే చట్టాన్ని మార్చారని తెలిపారు. అందుకే పాత చట్టాన్ని యధాతథంగా పునరుద్ధరించాలనీ, లేదంటే ఉధృత పోరాటాల తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బి పద్మ, సామాజిక కార్యకర్త సౌమ్య, గిరిజన సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఆర్ అంజనేయులు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్, కన్నెగంటి రవి, ఎస్ శివలింగం, ఆశాలత, ఉష, పులి కల్పన, వెంకటయ్య పాల్గొన్నారు.
గ్రామీణ పేదల పొట్టకొడితే.. భారత్ ఎలా వికసిస్తుంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



