విద్యాశాఖ కార్యదర్శికి బీఆర్ఎస్వీ వినతి
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కస్తూర్బాంగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీవీబీ) బంకర్ బెడ్ల టెండర్లో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్వీ విమర్శించింది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని తెలిపింది. ఈ టెండర్లపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇనుము ధర రూ.80 వేలు ఉండే టన్నుకు రూ.60 వేలకు తగ్గినప్పటికీ బంకర్ బెడ్ల టెండర్లో బెడ్ల ధరలు తగ్గించడానికి బదులుగా పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుయాయులకు లబ్ధి చేకూర్చే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని ట్రూఫా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మాఫట్లాల్ కంపెనీలకు అనుభవం లేని సంస్థలకు రూ.60 కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.160 కోట్ల అంచనాతో ధరలు పెంచి టెండర్లు అప్పగించారని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటూ రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అర్హత లేని కంపెనీలకు ఇచ్చిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తీవ్ర ఆందోళనలు, ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తొట్ల స్వామి, తుంగభాలు, రాష్ట్ర కార్యదర్శి ఆవాల హరిబాబు, విశాల్, నితీష్, నవీన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ టెండర్లపై విచారణ జరపండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



