Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచట్టం ముందు అందరూ సమానులే

చట్టం ముందు అందరూ సమానులే

- Advertisement -

కేటీఆర్‌ ఆలోచనా ధోరణి మారకుంటే బీఆర్‌ఎస్‌ బతుకదు
ఫేక్‌ పెట్టుబడుల ఒప్పందాలతో కాంగ్రెస్‌ మోసం
రాష్ట్రానికి నిధులివ్వని బీజేపీ సర్కార్‌ : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

చట్టం ముందు అందరూ సమానులేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. ” ప్రజా జీవితంలో ఉన్న వారెవరైనా కొన్ని పరిణామాలను ఎదుర్కోక తప్పదు. కేసీఆర్‌ పదేండ్లు సీఎంగా ఉన్నారు. ఆ క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో పిలిచి ఉంటారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. నన్ను విచారణకు పిలిస్తే వెళతాను. కేసీఆర్‌ను విచారణకు పిలవటమే నేరమన్నట్టు కేటీఆర్‌ విమర్శించడం తప్పు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పోకడలను మార్చుకోకుంటే బీఆర్‌ఎస్‌ను ఎవరు కాపాడలేరు…” అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణను కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుని పూర్తి చేస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. గత రెండేండ్లుగా ఈ విచారణ ”స్టాండ్‌ వేసి సైకిల్‌ తొక్కినట్టుగా..” సాగుతోందని ఎద్దేవా చేశారు. గుంటనక్కతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని అందుకే అసలు నేరస్తులు బయటికి రాకుండా విచారణను కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు.
ప్రజలు గుడ్డిగా ఓటేయొద్దు
మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులు మంచివారైనా, చెడ్డ వారైనా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయాలని కేటీఆర్‌ కోరడాన్ని కవిత తప్పుపట్టారు. చెడ్డ అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రజలు గుడ్డిగా ఓటు వేయకుండా తమను ఆపదలో ఆదుకునే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌తో సింహం గుర్తుపై ఆసక్తి కలిగిన జాగృతి నాయకులు కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో విద్యకు ఒక శాతం, వైద్యానికి ఒక శాతం మాత్రమే కేటాయించి బీజేపీ పేదల విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిందని కవిత విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాలను అడిగితే ఒక్కటి ఇవ్వలేదనీ, ముఖ్యమంత్రి 30 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లి కలిసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. మెట్రో ఫేస్‌-2పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. ఫేస్‌-1 నిధులు పూర్తిగా ఖర్చు చేస్తేనే ఫేస్‌-2కు ఇస్తారంటే, ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎలా కేటాయిస్తారు? అని ఆమె ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో వరస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న మున్సిపల్‌ శాఖను తన పరిధిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్షించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖను కూడా నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో పెరిగిపోతున్న గన్‌ కల్చర్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. అటవీ, ఎక్సైజ్‌ సిబ్బంది ఆయుధాలనివ్వాలని కోరారు.
సీఎం రేవంత్‌ రెడ్డి హార్వర్డ్‌ యూనివర్సిటీలో కోర్సు చేసేందుకు గౌరవంగా పిలిచారా? లేక ముఖ్యమంత్రి తానే స్వయంగా వెళ్లారా? అని కవిత ప్రశ్నించారు. ఒకవేళ స్వయంగా వెళితే ఆ కోర్సుకు ఫీజు ఎవరు చెల్లించారో చెప్పాలని కోరారు.
అవి నకిలీ పెట్టుబడులు
ఒక గ్లోబల్‌ సమ్మిట్‌తో పాటు మరో 3 ఆర్థిక సమ్మిట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని కవిత కొట్టిపారేశారు. ప్రభుత్వం చెప్పిన పలు కంపెనీలకు సంబంధించి వెబ్‌సైట్‌లో కనీస సమాచారం లేదనీ, కొన్ని కంపెనీలు ఆయా ఒప్పందాలకు కొద్ది కాలం ముందు పెట్టినవైతే, మరి కొన్ని కంపెనీలు తమ ఆర్థిక శక్తికి మించి ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. దీనిపై పరిశోధన చేస్తే ప్రజలను కాంగ్రెస్‌ ఏ విధంగా మోసం చేస్తున్నదో తెలిసిందని చెప్పారు. కుందూరు జయవీర్‌ రెడ్డి తన సంస్థ మార్కెట్‌ వాల్యూ కన్నా ఎక్కువగా ఒప్పందం చేశారనీ, దీనిపై ఆయనే స్పష్టతనివ్వాలని కోరారు. యువత దీనిపై ప్రచారోద్యమంలో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -