రెండేండ్ల తర్వాత రాకపోకలకు పరిమిత అనుమతులు
ఇజ్రాయిల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం
అమలులో కీలక ముందడుగు
రఫా: గాజాలోని రఫా బోర్డర్ క్రాసింగ్ తెరుచుకుంది. ఇజ్రాయిల్ – హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా సోమవారం ఈ సరిహద్దును ఓపెన్ చేశారు. అయితే ఈ మార్గం మీదుగా పరిమిత స్థాయిలోనే రాకపోకలకు గాజా పౌరులకు అనుమతులు ఇచ్చారు. ఈ వివరాలను ఈజిప్ట్, ఇజ్రాయిల్ భద్రతా విభాగాల అధికారులు మీడియాకు వెల్లడించారు. 50 మంది పాలస్తీనియన్లు గాజాలోకి వచ్చేందుకు, మరో 50 మంది గాజా నుంచి వెళ్లేందుకు అనుమతించామని వారు తెలిపారు.
అయితే ఏ రకమైన సరుకులకూ గాజాలో ప్రవేశం కల్పించలేదన్నారు. వైద్యచికిత్సల కోసం ఈజిప్టునకు వెళ్లేందుకు గాజాలోని దాదాపు 20వేల మంది పాలస్తీనా బాలలు, వయోజనులు ప్రస్తుతం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. రఫా బోర్డర్ క్రాసింగ్‌ను పూర్తిస్థాయిలో తెరిస్తేనే వీరంతా ఈజిప్టునకు వెళ్లి వైద్యచికిత్సలు చేయించుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం వేలాది మంది పాలస్తీనావాసులు ఈజిప్టు సరిహద్దు ప్రాంతాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు. గాజాలోని తమ ఇండ్లకు తిరిగి చేరుకునే అవకాశం కోసం వారు రఫా బోర్డర్ క్రాసింగ్ వద్ద వెయిట్ చేస్తున్నారు.
150 ఆస్పత్రులు సిద్ధం : ఈజిప్టు
పాలస్తీనా రోగులు, క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు తమ దేశంలో 150 ఆస్పత్రులను సిద్ధం చేశామని ఈజిప్టు ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. రఫా బోర్డర్ క్రాసింగ్ మీదుగా పాలస్తీనాకు చెందిన రోగులు ఈజిప్టులోకి ప్రవేశిస్తారని తెలిపింది. దీనిపై ఇజ్రాయిల్‌తో సమన్వయం చేసుకుంటున్నట్టు పేర్కొంది. అయితే గాజా పౌరులను పెద్ద సంఖ్యలో ఈజిప్టునకు పంపించి, రఫా బోర్డర్‌ను ఇజ్రాయిల్ ఆర్మీ మూసివేస్తుందనే ఆందోళనలో ఈజిప్టు ప్రభుత్వం ఉంది.
ఈయూ ఏజెంట్ల పర్యవేక్షణలో : ఇజ్రాయిల్
”రఫా బోర్డర్ క్రాసింగ్ మీదుగా జరిగిన కదలికలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు చెందిన బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు పర్యవేక్షిస్తున్నారు. వారి పర్యవేక్షణలోనే గాజా పౌరుల రాకపోకలు జరుగుతున్నాయి. ఒకవేళ పరిస్థితులు అదుపులోనే ఉంటే, గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లే పౌరుల సంఖ్యను విడతల వారీగా పెంచుతాం. ప్రస్తుతానికి పరిమిత స్థాయిలోనే గాజా పౌరుల రాకపోకలకు అనుమతులు ఇస్తున్నాం” అని ఇజ్రాయిల్ అధికార వర్గాలు వెల్లడించాయి.
వలస వెళ్లిన వారూ తిరిగి రావచ్చు
రోజుకు 50 మంది చొప్పున గాజా పౌరులు ఈజిప్టు వైపు వెళ్లేందుకు, మరో 50 మంది గాజాలోకి వచ్చేందుకు అనుమతిస్తామని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. ఒక్కో రోగి వెంట ఇద్దరు చొప్పున బంధువులు వెళ్లేందుకు సైతం అనుమతిస్తామని ఇజ్రాయిల్ అధికార వర్గాలు అంటున్నాయి. ఇజ్రాయిల్ – గాజా యుద్ధం సమయంలో ఈజిప్టునకు వలస వెళ్లిన వారు సైతం ఇప్పుడు రోజుకు 50 మంది చొప్పున గాజాలోకి రావచ్చన్నారు.
గాజావాసులకు ఈజిప్టే దిక్కు
ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో పాలస్తీనాలోని గాజాలో ఉన్న ప్రధాన ఆస్పత్రులన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో పొరుగు దేశం ఈజిప్టునకు వెళ్లి వైద్యచికిత్సలు చేయించు కోవాల్సిన పరిస్థితి పాలస్తీనా పౌరులకు వచ్చింది. పాలస్తీనా – ఈజిప్టు సరిహద్దుల్లో రఫా వద్ద సరిహద్దు ఉన్నది. అయితే పాలస్తీనా వైపున ఉన్న రఫా బోర్డర్ క్రాసింగ్ ప్రస్తుతం ఇజ్రాయిల్ సైన్యం అదుపులో ఉంది. పాలస్తీనాకు చెందిన మిగతా అన్ని సరిహద్దులు కూడా ఇజ్రాయిల్ ఆర్మీ చేతుల్లోనే ఉన్నాయి. 2023 అక్టోబరు 7 నుంచి దాదాపు ఏడాది పాటు గాజాపై ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులు చేసింది. దీంతో దాదాపు 71,700 మంది ప్రాణాలు కోల్పోయారు.
చివరకు 2024 మే నెలలో రఫా బోర్డర్ క్రాసింగ్‌ను ఇజ్రాయిల్ సైన్యం మూసివేసింది. హమాస్ మిలిటెంట్లకు ఆయుధాలు సప్లై కాకుండా అడ్డుకునేందుకు సరిహద్దు మూసివేశామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2025 అక్టోబరులో ఇజ్రాయిల్ – పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా వైద్యచికిత్సల కోసం ఈజిప్టునకు వెళ్లి వచ్చేందుకు గాజా ప్రజలకు అనుమతి ఇస్తామని ఇజ్రాయిల్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే సోమవారం రఫా సరిహద్దును తెరిచారు.
మూడేండ్ల పసికందు మృతి
గాజాలోని సముద్ర తీర ప్రాంతాలపై ఇప్పటికీ ఇజ్రాయిల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఇజ్రాయిలీ నౌవికాదళం జరిపిన కాల్పుల్లో ఖాన్ యూనిస్ పరిధిలోని మువాసీ తీరంలో ఉన్న ఒక టెంట్ క్యాంపు కాలి బూడిదైంది. ఈ ఘటనలో అందులో ఉన్న మూడేండ్ల పాలస్తీనా పసికందు ప్రాణాలు కోల్పోయాడు. 2025 అక్టోబరు 10న ఇజ్రాయిల్ – హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. నాటి నుంచి నేటి వరకు ఇజ్రాయిల్ దాడుల్లో దాదాపు 520 మందికిపైగా పాలస్తీనా పౌరులు చనిపోయారు. వీరిలో 100 మందికిపైగా పిల్లలు ఉన్నారు.



