Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంబుల్లెట్‌ ట్రైన్‌ మేజర్‌ హబ్‌గా హైదరాబాద్‌

బుల్లెట్‌ ట్రైన్‌ మేజర్‌ హబ్‌గా హైదరాబాద్‌

- Advertisement -

3 గంటల్లోనే హైదరాబాద్‌ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూర్‌కు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్‌లకు రూ. 5,454 కోట్లు : రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కొత్తగా రాష్ట్రానికి ప్రకటించిన మూడు హైస్పీడ్‌ ట్రైన్స్‌ తో త్వరలోనే హై స్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ మేజర్‌ హబ్‌ గా హైదరాబాద్‌ మారబోతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. రవాణా సహా అనేక కీలక అంశాల్లో లబ్ది చేకూరుతుందన్నారు. హెల్త్‌ కేర్‌, ట్రాన్స్‌ పోర్ట్‌, ఎడ్యుకేషన్‌ కు ఊతం ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు డైమండ్‌ ప్రాజెక్ట్‌ గా అభివర్ణించారు. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించడం అలైన్‌మెంట్స్‌ ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు.

సోమవారం నాడిక్కడ రైల్వే భవన్‌ లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో రైల్వే ప్రాజెక్ట్‌ ల కోసం కేంద్ర బడ్జెట్‌ లో చేసిన కేటాయింపులను వివరించారు. హైదరాబాద్‌ చెన్నై, హైదరాబాద్‌ పూణే, హైదరాబాద్‌ బెంగళూరు కు మూడు కొత్త హై స్పీడ్‌ ట్రైన్లు రానున్నాయని చెప్పారు. గంటలకు 350 కి.మీ వేగంతో ఈ ట్రైన్లు ఆయా ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగి ఉండనున్నట్టు చెప్పారు. డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌(డీపీఆర్‌), అలైన్‌మెంట్స్‌ ఫైనలైజ్‌ కాగానే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

కేవలం మూడు గంటల్లోనే ముంబయి, చెన్నై, బెంగళూరు
ఈ బుల్లెట్‌ ట్రైన్స్‌ తో హైదరాబాద్‌ నుంచి కీలక మెట్రో పాలిటన్‌ సిటీలైన ముంబాయి, బెంగళూరు, చెన్నై, పుణేలకు కేవలం మూడు గంటల్లోపే చేరుకొచ్చన్నారు. ప్రధానంగా హైదరాబాద్‌- పూణే కు కేవలం 1:55 గంటల్లో చేరుకోవచ్చని, పుణే – ముంబయి 48 నిమిషాల్లో చేరుకోవచ్చని వివరించారు. అంటే హైదరాబాద్‌ ముంబయికి కేవలం 2:30 గంటల్లో ఈ హై స్పీడ్‌ ట్రైన్స్‌ తో రీచ్‌ కావచ్చన్నారు. అలాగే హైదరాబాద్‌ చెన్నై కు మూడు గంటల లోపు, హైదరాబాద్‌ బెంగళూరు రెండు గంటల్లో చేరుకోవచ్చని వివరించారు. ఈ విధంగా మూడు ముఖ్యమైన మెట్రో పాలిటన్‌ సిటీల మధ్య గేమ్‌ ఛేంజర్‌ గా హైదరాబాద్‌ మారనుందన్నారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి దశలో ముంబాయి-అహ్మదాబాద్‌ కు హై స్పీడ్‌ ట్రైన్‌ ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ లో భాగంగా టెక్నికల్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ టీం… అన్ని అంశాలను పరిశీలించిందన్నారు. ఇది సక్సెస్‌ కావడంతో సెకండ్‌ ఫేజ్‌ లో దేశంలోని ఏడు ముఖ్య నగరాలను కలిపేలా ఏడు బుల్లెట్‌ ట్రైన్లు తీసుకువచ్చిందన్నారు. ఇందులో నార్త్‌ కు రెండు, సౌత్‌ వెస్ట్‌ రాష్ట్రాలకు మిగిలిన ఐదు ట్రైన్లు ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ లు పూర్తి అయిన తరువాత, దేశ వ్యాప్తంగా మరిన్ని హైస్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్లు తీసుకువస్తామన్నారు.

తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ అభివృద్ధికి రూ. 5,454 కోట్లు
ఈసారి కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్‌ ల అభివృద్ధికి రూ. 5, 454 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ లో రూ. 47,984 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. అమృత్‌ స్టేషన్‌ స్కీం కింద రూ. 2,015 కోట్లతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించినట్టు చెప్పారు. ఐదు వందే భారత్‌, మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ లతో ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచి కనెక్టివిటీని మెరుగుపరిచినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 1,115 కిలో మీటర్ల రైల్వే లైన్‌ 100 శాతం ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయినట్టు చెప్పారు. 499 అండర్‌ పాస్‌, ఫ్లై ఓవర్లు నిర్మించినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -