మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర
నవతెలంగాణ – బోనకల్
మండలంలో పట్టాదారు పాసుబుక్ కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేయించుకోవాలని మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో ముష్టికుంట్ల రైతు వేదిక నందు రైతు నమోదు(ఫార్మర్ రిజిస్ట్రీ) కార్యక్రమం గురించి రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆధార్ తో ప్రతి పౌరుడికి విశిష్ట సంఖ్య ఇచ్చినట్టే ప్రతి రైతుకు ఒక విశిష్ట సంఖ్య(11 అంకెల సంఖ్య) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ లో పేరు నమోదు తప్పని సరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రతి రైతు తన విశిష్ట సంఖ్య (ఫార్మర్ ఐడి) పొందడానికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం అవుతుందని తెలిపారు. పిఏం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఫసల్ భీమా, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్ లాంటి పథకాలు రైతులకు అందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
ఈ అవకాశాన్ని పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండలం వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి మరీదు త్రివేణి గ్రామ రైతులు పాల్గొన్నారు.



