నవతెలంగాణ – పరకాల
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు తుది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం 215 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అధికారుల పరిశీలనలో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం మిగిలిన వారిలో మెజారిటీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, చివరికి 22 వార్డులకు గానూ 100 మంది అభ్యర్థులు ఎన్నికల క్షేత్రంలో నిలిచి తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ చెరో 22 స్థానాల్లో పోటీ పడుతుండగా, బిజెపి 21 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది.
బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఏడుగురు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ముగ్గురు, సిపిఎం మరియు జనసేన పార్టీల నుండి ఇద్దరు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇతర గుర్తింపు పొందిన పార్టీల తరపున ఏడుగురు, స్వతంత్రులుగా 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పరకాలలో పోరు ఆసక్తికరంగా మారింది. ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు వెల్లడించిన ఈ జాబితాతో మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార హోరు మరింత ఊపందుకోనుంది.



