Wednesday, February 4, 2026
E-PAPER
Homeఆటలుఆ రికార్డు ఊరిస్తోంది!

ఆ రికార్డు ఊరిస్తోంది!

- Advertisement -

టైటిల్‌ ఫేవరేట్‌గా టీమ్‌ ఇండియా
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ జట్టూ టీమ్‌ ఇండియా తరహాలో హాట్‌ ఫేవరేట్‌గా బరిలో నిలువలేదు. ఇప్పటివరకు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎన్నడూ టైటిల్‌ నిలుపుకోలేదు, సొంతగడ్డపై ఆతిథ్య జట్టు టైటిల్‌ సాధించిన రికార్డు లేదు. ఈ రెండు రికార్డులు భారత్‌కు అందకుండా ఉండేందుకు అద్భుతాలు జరగాల్సిందే. కానీ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఎన్నడూ ఊహించిన రీతిలో ముగియలేదు. దీంతో శనివారం నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ మహా సంగ్రామం సూర్యసేనకు ఓ సవాల్‌.

నవతెలంగాణ క్రీడావిభాగం
2024లో అమెరికా, కరీబియన్‌ దీవుల్లో భిన్న పరిస్థితుల్లో రాణించి టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా.. 2026లో టైటిల్‌ నిలుపుకునేందుకు అంతకంటే గొప్పగా సిద్ధమవుతోంది. చివరగా 2023లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ ఓడిన భారత్‌.. ఈ ఫార్మాట్‌లో 6.5 గెలుపోటముల శాతంతో తిరుగులేని జట్టుగా నిలిచింది. 2011 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను సొంతగడ్డపై ముద్దాడిన భారత్‌.. ఆతిథ్య జట్టు వరల్డ్‌కప్‌ విజేతగా నిలువటానికి నాంది పలికింది. అదే తరహాలో 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌ చరిత్ర పునరావృతం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెల 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానుండగా.. టైటిల్‌ వేటలో 20 జట్లు పోటీపడుతున్నాయి.

గ్రూప్‌-ఏలో భారత్‌
20 జట్లు పోటీపడతున్న ప్రపంచకప్‌లో భారత్‌ గ్రూప్‌-ఏలో చోటుచేసుకుంది. యుఎస్‌ఏ, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ సైతం గ్రూప్‌-ఏలో ఉన్నాయి. ఈ నెల 7న యుఎస్‌ఏతో ముంబయిలో టైటిల్‌ వేట షురూ చేయనున్న భారత్‌.. 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్తాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ప్రతి గ్రూప్‌లో ఐదు జట్లు ఉండగా.. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్‌ ఎయిట్‌లో ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు పోటీపడతాయి. ప్రతి గ్రూప్‌ నుంచి ఉత్తమ రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 8న ఫైనల్‌ జరుగుతుంది. గ్రూప్‌ దశ తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ నేరుగా సెమీఫైనల్‌ లేదా ఫైనల్లోనే తలపడే అవకాశం ఉంది.

భీకర లైనప్‌
భారత లైనప్‌ ఎంతో పటిష్టంగా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌కు సైతం ఈ జట్టులో చోటు దక్కలేదు. బ్యాట్‌తో అభిషేక్‌ శర్మ, బంతితో వరుణ్‌ చక్రవర్తి భారత్‌కు కీలకం కానున్నారు. అభిషేక్‌ శర్మ కెరీర్‌ తొలి ప్రపంచకప్‌ ఆడనుండగా.. వరుణ్‌ చక్రవర్తి 2021లో ఆడినా ఆశించిన ప్రభావం చూపించలేదు. అభిషేక్‌, వరుణ్‌ చక్రవర్తి మెరిస్తే.. భారత్‌కు ఎదురుండదు. గత ప్రపంచకప్‌ నుంచి అభిషేక్‌ శర్మ 88 సిక్సర్లు బాదగా.. వరుణ్‌ చక్రవర్తి 57 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ భారత్‌కు మరో సవాల్‌. టైటిల్‌ నెగ్గేందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెసిండీస్‌లలో కనీసం రెండు జట్లను వారం వ్యవధిలో మూడు భిన్న వేదికల్లో భారత్‌ ఓడించాలి. నాకౌట్‌ మ్యాచ్‌లను సైతం వారంలోనే నెగ్గాలి. ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌ నిలుపుకోవటం క్రికెటర్లకు కీలకం. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు భారత్‌కు అదనపు హంగులు తెచ్చాయి. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ భీకరంగా ఉంది. హార్దిక్‌ పాండ్య, శివం దూబె, అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ షోకు సిద్ధమవుతుండగా.. రింకు సింగ్‌ ఫినిషర్‌గా ఎక్స్‌ ఫ్యాక్టర్‌ పాత్ర పోషించనున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రానా, వరుణ్‌ చక్రవర్తిలతో కూడిన బౌలింగ్‌ లైనప్‌ బలోపేంగా కనిపిస్తోంది. కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఎక్కువగా బెంచ్‌కు పరిమితం కానుండగా.. తుది జట్టులో చోటు కోసం ఇషాన్‌ కిషన్‌తో సంజు శాంసన్‌.. హర్షిత్‌ రానాతో అర్ష్‌దీప్‌ సింగ్‌ పోటీపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -