Wednesday, February 4, 2026
E-PAPER
Homeబీజినెస్బ్యాంకుల ప్రయివేటీకరణకు కుట్ర

బ్యాంకుల ప్రయివేటీకరణకు కుట్ర

- Advertisement -

తిరోగమన బడ్జెట్‌..
కార్పొరేట్ల కంటే ప్రజలపైనే పన్నులెక్కువ
సంక్షేమ పథకాలకు కోత..
బడా పారిశ్రామికవేత్తలకు లబ్ది
కేంద్ర బడ్జెట్‌పై బెఫీ తీవ్ర విమర్శలు

నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని తిరోగమన బడ్జెట్‌గా అభివర్ణించింది. మధ్యత రగతిపై పన్ను భారం, కార్పొరేట్లకు రాయితీలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌ ‘వికసిత్‌ భారత్‌’ నినాదంతో సామాన్యులను వంచించేలా ఉందని బెఫీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘బడ్జెట్‌లోని కేటాయింపులు పరిశీలిస్తే మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేసే వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.14.66 లక్షలుగా ఉంగా.. కార్పొరేట్‌ పన్నులు రూ.12.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తిగత పన్ను ఆదాయం కంటే కార్పొరేట్‌ పన్నులు తక్కువగా ఉండటం ప్రభుత్వ తిరోగమన విధానాలకు నిదర్శనం. వేతన జీవులపై భారాన్ని మోపుతూ.. కార్పొరేట్లకు మ్యాట్‌ తగ్గింపు వంటి రాయితీలు ఇవ్వడం గమనార్హం.” అని బెఫీ తన ప్రకటనలో పేర్కొంది.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..
సాధారణ రైళ్లు అపరిశుభ్రంగా, రద్దీగా మారుతున్నా పట్టించుకోలేదని, సీనియర్‌ సిటిజన్ల రాయితీలను పునరుద్ధరించకపోవడం దారుణమని పేర్కొంది. రైల్వే రంగంలో సాధారణ ప్రయాణి కులను విస్మరించి కేవలం ధనికులకే పరిమితమయ్యే ఖరీదైన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై బెఫీ అసహనం వ్యక్తం చేసింది. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలు, విపక్ష పాలిత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లను ఈ బడ్జెట్‌లో తీవ్రంగా నిర్లక్ష్యం గా చేశారని విమర్శించింది.

కార్పొరేట్‌ల లూటీకి చట్టబద్ధత
ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు మెరుగుపడ్డాయని ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ బడా కార్పొరేట్‌ ఎగవేతదారుల నుంచి బకాయిల వసూలుపై బడ్జెట్‌ మౌనంగా ఉందని బెఫీ విమర్శించింది. బ్యాంక్‌ దివాలా చట్టం (ఐబీసీ) పేరుతో కార్పొరేట్లకు చేస్తోన్న భారీ రుణాల మాఫీ ద్వారా ప్రజల సొమ్మును కార్పొరేట్లు లూటీ చేయడానికి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు ఉందని ఆరోపించింది. క్రోనీ క్యాపిటలిజం వల్ల ఏర్పడిన మొండి బకాయిలకు బ్యాంక్‌ ఉద్యోగులను, ప్రభుత్వ రంగ బ్యాంకులను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొంది. బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు, ఫిన్‌టెక్‌ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రయివేటు సంస్థలు లాభదాయకమైన వ్యాపారాల ను చేజిక్కించుకుంటున్నాయని, ప్రభుత్వ బ్యాంకులు మాత్రం కేవలం సామాజిక బాధ్యతలు, అధిక రిస్క్‌ ఉన్న లావాదేవీలకు పరిమిత మవుతున్నాయని పేర్కొంది. ప్రభుత్వ ఈ ద్వంద్వ విధానం బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యాన్నే దెబ్బతీ స్తోందని, బడ్జెట్‌ ప్రకటనల తర్వాత ప్రభుత్వ బ్యాంకుల షేర్లు పడిపోవడమే దీనికి నిదర్శనమని తెలిపింది.

బ్యాంక్‌ల్లో సిబ్బంది కొరతపై మౌనం
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని బెఫీ పేర్కొంది. పీఎస్‌బీలను కేవలం ఆదాయం పిండుకునే వనరులుగా చూస్తూ.. వాటిని ప్రయివేటీకరణ వైపు నడిపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో సిబ్బంది కొరత, పని ఒత్తిడి వంటి అంశాలపై బడ్జెట్‌ మౌనంగా ఉందని తెలిపింది. కార్పొరేట్‌ల మొండి బకాయిల వసూలు పై స్పష్టత లేదని పేర్కొంది. బ్యాంకుల నుంచి భారీగా డివిడెం డ్లు ఆశిస్తూ వాటి ఆర్థిక పునాదులను కేం ద్రం బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు దెబ్బ..
బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీగా కోతలు విధించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఆహార సబ్సిడీలలో కోత విధించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని బెఫీ హెచ్చరించింది. నిరుద్యోగం వంటి కీలక సమస్యలను విస్మరించిన ఈ కార్పొరేట్‌ అనుకూల బడ్జెట్‌ను వ్యతిరేకించాలని, ఆర్థిక అసమానతలకు కారణమయ్యే ఇటువంటి విధానాలపై సామాన్య ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని బెఫీ పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -