అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సీపీఐ(ఎం) విమర్శ
న్యూఢిల్లీ : అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన కార్పొరేట్ మీడియాలో ఆతృతను, ఆనందోత్సాహాలను రేకెత్తించింది. కానీ ఈ ఒప్పందం వివరాలు ఇంకా అందుబాటులోకి రానందున ప్రస్తుతానికి ఈ అంశం పూర్తిగా అసమంజసంగా వుంది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి పరిధి, వివరాలు అందుబాటులోకి వచ్చినపుడు మాత్రమే సరైన రీతిలో అంచనా వేయడం సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టుల్లో ప్రకటించిన ప్రకారం, భారత ఉత్పత్తుల దిగుమతులపై 18 శాతం టారిఫ్‌లు తగ్గుతాయి. అదే సమయంలో అమెరికా ఉత్పత్తులపై మాత్రం భారత్ జీరోకు టారిఫ్‌లను కుదించింది, టారిఫ్‌యేతర అడ్డంకులను కూడా పూర్తిగా తొలగించింది. ఇలా టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేయడం వల్ల దేశంలోకి అమెరికా ఉత్పత్తులు వెల్లువెత్తుతాయి. దానివల్ల మన పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. కార్మికుల జీవనోపాధులు దెబ్బతింటాయి. టారిఫ్‌యేతర అడ్డంకులను తొలగించడమంటే సబ్సిడీలను ఎత్తివేయడం, భారత రైతాంగానికి మద్దతుగా నిలిచే ఇతర చర్యలను రద్దు చేయడం. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని, 500 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇంధనాన్ని, సాంకేతికతను, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కట్టుబడిందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇదే గనుక నిజమైతే, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఈ వాణిజ్య ఒప్పం దం తీవ్ర అసమానతల స్వభావం కలిగివుందని, భారత్ తన సార్వ భౌమాధికారాన్ని పరిమితం చేసుకుంటూ అమెరికాకు లొంగిపోయిన వైఖరి కనిపిస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. అమెరికాతో కుదుర్చుకున్న పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందాన్ని పార్లమెంట్‌లో, పబ్లిక్ డొమైన్‌లో ప్రవేశ పెట్టడం ముఖ్యమని, అప్పుడే దానిపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలు వుంటుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇందులో ఏవైనా హానికర నిబంధనలు వుంటే వెంటనే వాటిని రద్దు చేసి భారత పరిశ్రమలు, వ్యవ సాయం, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని పొలిట్‌బ్యూరో కోరింది.
అసమతుల్యం
- Advertisement -
- Advertisement -



