– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
– చురుగ్గా నైరుతి రుతుపవనాలు
– కేరళ, గోవా మొత్తం విస్తరణ
– కర్నాటక, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత మేర వ్యాప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల మేర తగ్గే సూచనలున్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 200 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సోమవారం నాడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, మంగళవారం నాడు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో, 28న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీచే అవకాశముంది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతూ విస్తరిస్తున్నాయి. కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా అంతటా, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, మిజోరంలోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు వ్యాప్తిచెందాయి.
అత్యధిక వర్షం కురిసిన ప్రాంతాలు
మాటూరు (నల్లగొండ) 4.5 సెంటీమీటర్లు
రాజంపేట(యాదాద్రి భువనగిరి) 4.2 సెంటీమీటర్లు
ముల్కచర్ల(నల్లగొండ) 3.3 సెంటీమీటర్లు
పాముకుంట(యాద్రాద్రి భువనగిరి) 3.1 సెంటీమీటర్లు
రాజాపూర్(మహబూబ్‌నగర్) 3.0 సెంటీమీటర్లు
రాష్ట్రంలో మూడ్రోజులు భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES