నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద పట్టణంలో ప్రతి బుధవారం వారంతపు సంత కొనసాగుతోంది. బిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతోపాటు మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్, డోంగ్లీ మండలాల్లోని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంతకు వస్తుంటారు. గతంలో ప్రతి బుధవారం గ్రామంలోకి వెళ్లే ప్రధాన వీధులలో కూరగాయలు, పండ్లు, ఇతరాత్ర సరుకుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిగేవి ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడడంతో మున్సిపల్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మూడు వారాల పాటు వారాంతపు సంత నిర్వహించుటకు స్థలం కేటాయించి వారాంతపు సంతను తరలించి చేతులు దులుపుకున్నారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా నుండి రాజుల్లా చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుపైనే కూరగాయలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేయడం తోపుడు బండ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి విక్రయాలు జరపడం ఇతరత్రా దుకాణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలు కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాజుల్లా చౌరస్తాలో ప్రధాన రహదారిపై బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు గంటలపాటు ట్రాఫిక్ లో స్తంభించి పోవడంతో మద్నూర్, దెగ్లూర్, జుక్కల్, హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ రోగులను తీసుకువెళ్లాల్సిన 108 వాహనం వస్తే సైతం ట్రాఫిక్ లో ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షల రూపాయల తై బజార్ వేలం ద్వారా మున్సిపాలిటీ కి ఆదాయం సమకూరిన మేజర్ గ్రామపంచాయతీ నుండి అప్ గ్రేడ్ అయినా మున్సిపాలిటీగా మారినా అధికారుల నిర్లక్ష్యంతో కనీస సౌకర్యాలు, సరైన దిశ నిర్దేశాలు చేయకపోవడంపై మున్సిపాలిటీ అధికారులపై సంతకు వచ్చిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.



