Monday, May 26, 2025
Homeబీజినెస్రూ.16వేల కోట్ల రికవరీ లక్ష్యం

రూ.16వేల కోట్ల రికవరీ లక్ష్యం

- Advertisement -

– 1 శాతం దిగువకు ఎన్‌పీఏలు
– పిఎన్‌బి ఎండి అశోక్‌ చంద్ర వెల్లడి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రుణ రికవరీలపై కీలక దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్ల అప్పులను రికవరీ చేయడం ద్వారా మొండి బాకీలను 1 శాతం దిగువకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పీఎన్‌బీ ఎండి, సీఈఓ అశోక్‌ చంద్ర వెల్లడించారు. గడిచిన 2024-25 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.4,733 కోట్ల రికవరీ చేసినట్టు తెలిపారు. మున్ముందు కూడా గరిష్టంగా రికవరీలను పెంచడంతో పాటు తాజా మొండి బాకీలపై దృష్టి సారించనున్నామన్నారు. 2024-25లో మొత్తంగా రూ.14,000 కోట్ల మొండి అప్పులను రికవరీ చేయగలిగామన్నారు. ఈ ఏడాది రూ.16,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతీ త్రైమాసికంలోనూ సగటున రూ.1500-1,700 కోట్ల మొండి బాకీలు చోటు చేసుకోవచ్చని అంచనా వేశామన్నారు. ముఖ్యంగా టెక్నికల్‌గా రద్దు చేయబడిన మొండి బాకీల వసూళ్ల రికవరీపై కసరత్తు జరుగుతుందన్నారు. ఈ విభాగంలోని రూ.6,000 కోట్లు ఉండొచ్చన్నారు. ఇందులో ప్రతీ త్రైమాసికంలో కనీసం రూ.1,500 కోట్లు రాబట్టాలని నిర్దేశించుకున్నామన్నారు. తమ బ్యాంక్‌ మొత్తంగా టెక్నికల్‌గా రూ.91,000 కోట్ల ఎన్‌పిఎలను రద్దు చేసిందన్నారు. ముఖ్యంగా రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల రుణ విభాగంలో ఎక్కువ ఎన్‌పీఏలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ఆర్‌ఎఎం సంస్థలకు మద్దతు
తమ బ్యాంక్‌ ముఖ్యంగా రిటైల్‌, అగ్రికల్చర్‌, ఎంఎస్‌ఎంఈ (ఆర్‌ఎఎం) రంగాలకు ప్రధాన మద్దతును అందించాలని భావించిందని అశోక్‌ చంద్ర తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పుస్తకంలో వీటి వాటా 58 శాతంగా ఉండొచ్చన్నారు. ఈ విభాగాలకు 2024-25లో రూ.6,02,682 కోట్లను జారీ చేయడం ద్వారా మొత్తం రుణ పుస్తకంలో 56 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు. ఆర్‌ఎఎంను 56 శాతం నుంచి 58 శాతానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ నికర లాభాలు రెట్టింపై రూ.16,630 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది రూ.8,245 కోట్ల లాభాలు నమోదు చేసింది. మొత్తం వ్యాపారం 14 శాతం పెరిగి రూ.26.83 లక్షల కోట్లకు చేరడం ద్వారా బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒక్కటిగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -