– ఐటి కారిడార్‌లో సెలెక్ట్ మొబైల్స్ ఇ-వేస్ట్ బిన్ ఏర్పాటు : ఇ-వేస్ట్‌లోనూ విలువైన లోహాలు జయేష్ రంజన్ వెల్లడి
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వేస్ట్‌తోనూ డిస్కౌంట్ ఓచర్లను పొందేలా ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సెలెక్ట్ మొబైల్స్ ఇ-వేస్ట్ బిన్‌లను అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రహేజా ఐటి పార్క్ మైండ్‌స్పేస్‌లో ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సెలెక్ట్ మొబైల్స్ ఇ-వేస్ట్ సేకరణ బిన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ వేస్ట్‌లో విలువైన లోహాలు ఉన్నాయన్నారు. స్టోర్ మోడల్‌లో మాత్రమే కాకుండా పబ్లిక్ ప్రాంతంలో ఇ-వేస్ట్ సేకరణ బిన్‌ను ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయమన్నారు. ఇ-వేస్ట్‌లో అనేక వస్తువులు, పరికరాలు, రసాయనాలు చాలా విలువైనవి ఉన్నాయన్నారు. ఇ-వేస్ట్‌ను జాగ్రత్తగా ఉపయోగించుకోలేకపోతే మానవాళికి, జంతుజీవం, ప్రకృతి విలువలకు హాని జరగనుందని హెచ్చరించారు. గతంలో కొన్ని మాసాల క్రితం సెలెక్ట్ సంస్థ మిషన్ ఇ-వేస్ట్ సమీకరణను ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వరంగల్, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు కూడా విస్తరించడం గొప్ప విషయమన్నారు. ప్రతీ ఐటి బిల్డింగ్‌లోనూ ఇలాంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. సైబరాబాద్‌లో దాదాపు 350పైనా ఐటి బిల్డింగ్‌లు ఉన్నాయని.. వీటన్నిటిలోనూ క్రమంగా ఇ-వేస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా సంస్థలను మేము కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెలెక్ట్ మొబైల్స్ సిఎండి వై గురు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని పాల్గొన్నారు.
రూ.10,000 వరకు డిస్కౌంట్..
ఈ-వేస్ట్ బిన్‌తో పాటు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన మొబైల్ నెంబర్, వారి పేరును నమోదు చేయవలెను. ఈ వేస్ట్ యొక్క వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. వెంటనే వర్య్చూవల్‌గా రూ.10,000 వరకు విలువ గల డిస్కౌంట్ కూపన్ పొందవచ్చు. ఆ డిస్కౌంట్ కూపన్‌ను దగ్గరలో ఉన్న సెలెక్ట్ మొబైల్ స్టోర్‌కు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలుపై రిడీమ్ చేసుకోవచ్చని వై గురు తెలిపారు. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు, మౌస్, కీబోర్డ్ తదితర అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ-వేస్ట్‌గా పరిగణిస్తామన్నారు. ఈ-వేస్ట్ నిర్మూలన దిశగా సెలెక్ట్ మొబైల్స్ ఈ-వేస్ట్ రంగంలోని మూడు ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తుందని గురు వెల్లడించారు.