Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం సారు..లొంగిపోయారు

పీఎం సారు..లొంగిపోయారు

- Advertisement -

అట్టుడికిన పార్లమెంట్‌ ఉభయసభలు
ఆవరణలో 8 మంది సస్పెన్షన్‌ ఎంపీల ఆందోళన
ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ,ఇతర ఎంపీల మద్దతు
నిజాలు బయటకు వస్తాయని కేంద్రం జంకుతోంది : ప్రతిపక్షాలు
లోక్‌సభలో వాయిదాల పర్వం


పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌, అమెరికా ట్రేడ్‌ డీల్‌పై ఉభయసభలూ అట్టుడుకుతున్నాయి. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలోనూ బుధవారం ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. పార్లమెంట్‌ ఆవరణలోనూ ప్రతిపక్షాలు ప్లకార్డులు పట్టుకుని నినదించాయి. పార్లమెంట్‌ ముఖద్వారం వద్ద బైటాయించి.. ‘పీఎం రాజీపడ్డారు’ అనే పోస్టర్‌ను ప్రదర్శించాయి. సభలోకి వెళ్తున్న కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌కూ నిరసన సెగ తగిలింది.

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌, ఆర్మీ మాజీ చీఫ్‌ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలోని అంశాలు ఎక్కడ బయటపడతాయో అని కేంద్రం భయపడుతోందని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. బుధవారం ఉభయ సభల ఆరంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలోని మకర ద్వారం వద్ద సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీ ఎస్‌. వెంకటేషన్‌, కాంగ్రెస్‌ ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌, ప్రశాంత్‌ పడోలే, హిబి ఈడెన్‌, డీన్‌ కురియకోస్‌, గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా, అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ పాల్గొన్నారు. ప్రధాని మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (‘పీఎం ఈజ్‌ కాంప్రమైజ్డ్‌’)తో రాజీపడ్డారని ప్లకార్డులు, భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. జనరల్‌ మనోజ్‌ కుమార్‌ నరవణె పుస్తకంతో పాటు నరేంద్ర మోడీ ఫొటోను ఆ బ్యానర్‌పై ముద్రించారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. ప్రజల కోసం మాట్లాడుతుంటే గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తోందని అన్నారు. కానీ ప్రజాక్షేత్రంలో నిజాలు చెప్పకుండా ఎలా అడ్గుకోగలరని ప్రశ్నించారు. దేశ భవిష్యత్తును మోడీ తాకట్టు పెడుతున్న తీరు, ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ చేసే తప్పులను అంగీకరిస్తేనే… పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తామనేలా ఎన్టీఏ సర్కార్‌ వ్యవహరిస్తోందన్నారు. దేశ శ్రేయస్సు, భవిష్యత్తు తరాల కోసం మాట్లాడేందుకు సభలో అవకాశం కల్పించకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రతిపక్ష నేతకే మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే, దేశం కోసం ప్రశ్నిస్తే మైక్‌ కట్‌ చేస్తుంటే.. ఇక సభలు నిర్వహించుకోవడం ఎందుకని, ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

వాయిదాల పర్వంలో లోక్‌సభ
వివిధ అంశాలపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో లోక్‌సభ వరుసగా మూడో రోజు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం ఇవ్వలేదు. ప్రతిపక్షాల నిరసనల కారణంగా పలుమార్లు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన తరువాత లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. ఆర్మీ మాజీ చీఫ్‌ ఎంఎం నరవణే పుస్తకంలోని అంశం వెల్లడిపై చర్చ జరగకపోవడం, నిరసన తెలుపుతున్న ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం, ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అపార్థాలను సృష్టించడాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు బుధవారం ఉదయం సభలో ఆందోళనకు దిగాయి.

సభను ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీపై ధ్వజమెత్తారు. సభలో ఈ ఇద్దరి గురించి పుస్తకాల నుంచి సారాంశాలను చదివిన తరువాత, దూబే ‘వీరు అనైతికులు, అవినీతిపరులు, మోసగాళ్ళు’ అని ఆరోపించారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలిపాయి. స్పీకర్‌ జోక్యం చేసుకుని సభ కార్యకలాపాలకు సంబంధం లేని పుస్తకాలను చదవవద్దని ఆదేశించారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగడంతో సభను సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు. సాయంత్రం 5 గంటలకు సభ తిరిగి సమావేశమైంది. కానీ ప్రతిపక్షాల నిరసన తగ్గలేదు.

ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వేదికపైకి వచ్చినప్పుడు, అధికార పక్షం కూడా ప్రతి నినాదాలతో ముందుకు వచ్చింది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ఘర్షణకు దారితీసే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సభను గురువారం వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. ఇంతలో, ప్రతిపక్ష మహిళా సభ్యులు ప్రధానమంత్రి సీటును ఆక్రమించారని బీజేపీకి చెందిన మనోజ్‌ తివారీ ఆరోపించారు. మహిళా సభ్యులు ప్రధానమంత్రి సీటును చుట్టుముట్టడంతో ఆయన సభలోకి ప్రవేశించలేకపోయారు. కేంద్ర మంత్రులు, సీనియర్‌ సభ్యులు పదే పదే అభ్యర్థించినప్పటికీ, మహిళా ఎంపీలు ప్రధానమంత్రికి దారి ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో వారు ప్రధానిపై దాడి చేయాలనే మూడ్‌లో ఉన్నారని తాను అనుమానిస్తున్నానని మనోజ్‌ తివారీ అన్నారు. మరోవైపు మిగిలిన రోజుల సమావేశానికి వ్యూహాలను రూపొందించడానికి ప్రతిపక్ష ఎంపీలు గురువారం సమావేశం కానున్నారు.

ఓటు వేయాలనుకుంటే ఇన్ని అడ్డంకులా?
రాజ్యసభలో కమల్‌హాసన్‌

రాజకీయనేతగా మారిన ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం చీఫ్‌ కమల్‌ హాసన్‌ బుధవారం రాజ్యసభలో తొలిసారిగా ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజలు కేవలం ఓటు వేయాలనుకుంటారు, కానీ కమిషన్లు మాత్రం వారి ఓటు హక్కును తనిఖీ చేస్తున్నాయి. ఓటు వేసేందుకు వారి అర్హతలు, స్పెల్లింగ్‌ తప్పులు, అడ్రస్‌ల గురించి సోదాలు, తనిఖీలను ఎదుర్కొనాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల గురించే తన ఆందోళన అంతా అని ఆయన అన్నారు. డీఎంకే వ్యవస్థాపకుడు సి.ఎన్‌.అన్నాదురై ద్వారానే తాను తమిళానికి పరిచయమయ్యానంటూ గుర్తు చేసుకున్నారు.

మన భాష, సంస్కృతి, మన హక్కులపై ఏదైనా దాడి జరిగితే దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనాలని ఆయన తమకు నేర్పారని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ గురించి మాట్లాడుతూ, ”ఈ ప్రజాస్వామ్య రథం విభేదాలను తొక్కిపట్టవచ్చు, కానీ ఎన్నటికీ ప్రజలను తొక్కిపట్టరాదు. దాన్ని మనం అనుమతించరాదు.” అని వ్యాఖ్యానించారు. ఏ వ్యక్తీ లేదా ప్రభుత్వమూ శాశ్వతం కాదని అన్నారు. అలాగే ఏ పాలనా యంత్రాంగం కూడా శాశ్వతంగా వుండిపోదన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటూ యువత ఎదగాలని ఆకాంక్షించారు. హైస్కూల్‌ డ్రాపౌట్‌గా తాను ఆర్థికాంశాలపై మాట్లాడేందుకు అనర్హుడినని ఆయన చెప్పుకున్నారు. గత జులై మాసంలో రాజ్యసభ పార్లమెంట్‌ సభ్యునిగా కమల్‌ హాసన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -