– నిరసనకారులను అడ్డుకున్న భద్రతా సిబ్బంది
– రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత
– వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం
– ఐదుగురికి గాయాలు
ఇంఫాల్ : ప్రభుత్వ బస్సుపై రాసి ఉన్న ‘మణిపూర్’ పేరును తొలగించడంపై ఆ రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ (కొకొమి) ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఆ రాష్ట్రంలో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో భాగంగా రాజ్‌భవన్‌ను ఘెరావ్ చేయడానికి వెళుతున్న నిరసనకారుల్ని కాంగ్లా గేట్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో భద్రతాదళాలను వారు ప్రశ్నించారు. వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారుల్ని చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిం చారు. దీంతో ఐదుగురు ఆందోళనకారులు గాయ పడ్డారు. ఈ నెల 20న ఉఖ్రుల్ జిల్లాలో శిరురు లిల్లీ ఉత్సవాన్ని కవర్ చేయడానికి జర్నలిస్టులను తీసుకువెళుతున్న ప్రభుత్వ బస్సును భద్రతా సిబ్బంది ఆపారు. బస్సు విండ్‌షీల్డ్‌పై రాసిన ఉన్న మణిపూర్ అనే రాష్ట్రం పేరు కనిపించకుండా తెల్ల కాగితంతో కప్పాలని బస్సులో ఉన్న సిబ్బందిని బలవంతం చేశారు. ఈ ఘటనపై నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. మణిపూర్ గుర్తింపును అవమానించి నందుకు గవర్నర్ అజరు కుమార్ భల్లా క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ”గవర్నర్ మౌనంగా ఉంటూ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న సమయంలో మణిపూర్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా అవమానించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కేవలం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సరిపోదు. ఈ ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలి” అని నిరసనకాలు తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘మణిపూర్’ పేరు తొలగింపుపై ఆందోళనలు
- Advertisement -
- Advertisement -