Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి సైనికుల్లా కదలాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి సైనికుల్లా కదలాలి

- Advertisement -

మతోన్మాద శక్తులను తుడిచిపెట్టడమే మన లక్ష్యం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య
మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) విస్తృతస్థాయి సమావేశం

నవతెలంగాణ-మహబూబాబాద్‌ /గార్ల
మహబూబాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్‌-సీపీఐ(ఎం) కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీసభ్యులు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్తీ గార్డెన్‌లో పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్‌ సీతారాంనాయక్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, ప్రతి వార్డులో ఎర్రజెండా విజయ కేతనం ఎగురవేయాలని కోరారు.

కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని విమర్శించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇస్తూ.. పేద, మధ్యతరగతి ప్రజలను, రైతులను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన అధికారాలను, నిధులను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకొని మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని అన్నారు.

అభివృద్ధి కోసం ఐక్యం : ఎమ్మెల్యే మురళినాయక్‌
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసే లక్ష్యంతోనే కాంగ్రెస్‌-సీపీఐ(ఎం) పొత్తు కుదుర్చుకున్నాయని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీ నాయక్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయని, గతంలో కాంగ్రెస్‌-సీపీఐ(ఎం) కలిసి పనిచేసిన అనుభవం పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

పోరాటయోధులే కౌన్సిలర్లుగా ఉండాలి: సాదుల శ్రీనివాస్‌
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) నాయకులు మున్సిపల్‌ పాలకవర్గంలో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అన్నారు. గతంలో గుడిసెవాసుల పోరాటంలో సీపీఐ(ఎం) పాత్రను గుర్తుచేస్తూ, చట్టసభ ల్లో ప్రజాగొంతుక వినిపించేందుకు కూట మి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కూటమి విజయానికి కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని డీసీసీ అధ్యక్షులు భూక్య ఉమా మురళి నాయక్‌ సూచించారు.

ఈ సభలో సీపీఐ(ఎం) నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తేజావత్‌ వినోద(4వ వార్డు), బానోత్‌ బాబు(15వ వార్డు), బానోత్‌ పద్మ (16వ వార్డు), చాగంటి భాగ్యమ్మ (29వ వార్డు), సూర్ణపు సోమయ్య(30వ వార్డు), మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్‌ చందర్‌ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నక్క సైదులు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -