నితిన్ నబిన్‌కు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చిన నిధులెన్నో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్‌ను ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా వచ్చే అవకాశముండటంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే రాష్ట్రానికి ప్రచారానికి వచ్చారనీ, ఆ పార్టీ మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా న్యాయం జరగలేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులను సైతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బయ్యారం స్టీల్‌ప్లాంట్,సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు, ఐఐఎమ్ ఏర్పాటుతో పాటు పలు అంశాల్లో అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆ పార్టీ సహకరించడంలేదని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు, బయో, ఫార్మ, సెమి కండక్టర్ పరిశ్రమలు, పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని విస్మరించారని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతమనీ, ఆ లెక్కన కేంద్రం నుంచి రూ.3.76 లక్షల కోట్లు రావాల్సి ఉండగా గత ఐదేండ్లలో రూ.1.84 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఐదేండ్లలో రూ.4.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి తిరిగి రూ.3.76 లక్షల కోట్లే ఇచ్చిందని తప్పు పట్టారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్స్ గుజరాత్ తదితర రాష్ట్రాలకు బడ్జెట్ రూపంలో తరలిస్తున్నదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బడ్జెట్‌లో మహిళలకు రూ.90 వేల కోట్ల కోత పెట్టారనీ, బీసీలకు రూ.13,600 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైంసా అల్లర్లను ఆసరగా చేసుకుని బీజేపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కని బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.



