నవతెలంగాణ – హైదరాబాద్: గత నెల రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపించిన కోడిమాంసం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పండగలు, తీర్థాల సీజన్లో ‘ట్రిపుల్ సెంచరీ’ మార్కును తాకిన చికెన్ ధర, గత పది రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతుండటం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ప్రస్తుతం సరఫరా పెరగడం, అదే సమయంలో వినియోగం కొంత మేర తగ్గడంతో మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటోంది. నెల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 300 దాటగా, ఇప్పుడు అది ప్రాంతాన్ని బట్టి రూ. 220 నుంచి రూ. 250 మధ్యకు చేరింది.
లైవ్ కోడి ధర సైతం కిలో రూ. 140 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పౌల్ట్రీ ఫారాల్లో ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండటం, డిమాండ్‌కు మించి లభ్యత ఉండటమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హోటళ్లు, ఫంక్షన్ల నుంచి ఆర్డర్లు సాధారణంగా ఉన్నప్పటికీ, గృహ అవసరాల కోసం కొనేవారి సంఖ్య కొంత తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపింది. కేవలం మాంసం మాత్రమే కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 9కి చేరిన కోడిగుడ్డు ధర కూడా ఇప్పుడు రూ. 6కు పడిపోయింది. పౌల్ట్రీ యజమానుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో ఉత్పత్తి మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.



