నవతెలంగాణ – మల్హర్ రావు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బోయిన్‌పేట, ముత్యాలమ్మవాడ, కూరగాయల మార్కెట్‌తో పాటు పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను ఆయన కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోనే తమ ప్రభుత్వ దిక్సూచిగా తీసుకొని ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ముఖ్యంగా మంథని మున్సిపాలిటీలో రూ.రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పని చేసి ఓట్లు అడుగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. కొంతమంది మేనిఫెస్టో గురించి తెలియకుండానే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోను దిక్సూచిగా చేసుకొని అభివృద్ధి, సంక్షేమంతో పాటు కొత్త పథకాల అమలుకు కట్టుబడి ముందుకు సాగుతోందని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పునరధ్ఘాటించారు.




