నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ స్పందన లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ గురువారం ఆమోదించింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రతిపక్షాల సవరణలను తిరస్కరించి .. ధన్యవాద తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టారు. జనవరి 28న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ చదివి వినిపించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు చేపడుతుండగా.. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు.
ప్రతిపక్ష సభ్యులు ‘అసాధారణ రీతిలో నిరసన’ తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ‘కచ్చితమైన సమాచారం’ ఉన్నందున బుధవారం ప్రధాని మోడీని సభకు రావద్దని సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. అనంతరం గురువారం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోడీ బుధవారం స్పందించాల్సి వుంది. సాయంత్రం 5గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం సభను నిర్వహించడానికి అనుమతించాలని చైర్‌పర్సన్ సంధ్యారాయ్ ఎంపిలకు విజ్ఞప్తి చేశారు. కానీ నిరసనలు కొనసాగుతుండటంతో ప్రసంగం వాయిదా పడింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా ఎంపిలు బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ మాజీ ప్రధానులపై బిజెపి ఎంపి నిషికాంత్ దూబే వ్యాఖ్యలను ఖండిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు.



