Friday, February 6, 2026
E-PAPER
Homeమానవిబడ్జెట్ లో మహిళల వాటా ఎక్కడా?

బడ్జెట్ లో మహిళల వాటా ఎక్కడా?

- Advertisement -

మహిళలకు పని భారం పెరిగింది. ఆదాయం తగ్గింది. ముఖ్యంగా వేతనం లేని సంరక్షణా బాధ్యతలతో మహిళలు అసమాన భారం మోస్తున్నారని ఈ ఏడాది గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అయినా మహిళలకు ఊరటనిస్తుందని అందరూ భావించారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా జరిగిందని మహిళా సంఘాలు, స్వచ్ఛంద కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇటు కుటుంబం, అటు ఉపాధి పరంగా రెండు బాధ్యతలు మోస్తున్న మహిళలను కేంద్ర ప్రభుత్వం తన అంకెల గారడితో మోసం చేసిందంటున్నారు.

గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం మహిళలు రెండు రకాల భారాలను మోస్తున్నారు. కుటుంబ సభ్యుల సంరక్షణా బాధ్యతను నిర్వర్తిస్తూ ఆదాయం పొందలేని ఇంటి పనితో అసమానమైన భారాన్ని మోస్తూనే ఉన్నారని సర్వే పేర్కొంది. ఆదాయం వచ్చే ఉపాధి లభ్యత, సౌకర్యవంతమైన పని ప్రదేశాల ప్రాధాన్యతను ఇది వివరిస్తుంది. సర్వే ప్రకారం మహిళలు ఇళ్లలో ప్రాథమిక సంరక్షకులుగా ఉన్నారు. 15-59 ఏండ్ల వయసు గల స్త్రీలలో దాదాపు 41శాతం మంది కుటుంబ సభ్యుల సంరక్షణా కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు నివేదించారు. అదే వయసు పురుషుల్లో ఇది 21.4 శాతంగా ఉంది. అంటే సగటున మహిళలు రోజుకు దాదాపు 140 నిమిషాలు సంరక్షణ కోసం గడుపుతున్నారు. ఇది పురుషులు గడిపే 74 నిమిషాల కంటే దాదాపు రెట్టింపు.

స్పష్టమైన లింగ వివక్షణ
ఆదాయానికి, ఆదాయం పొందే కార్యకలాపాల మధ్య సమయం కేటాయింపులో స్పష్టమైన లింగ వ్యత్యాసాలను ఈ డేటా వెల్లడించింది. ఆరేండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారందరూ ఆదాయం పొందని బాధ్యతల్లో గడిపే సగటు సమయం రోజుకు 278 నిమిషాలు అయితే చెల్లింపు కార్యకలాపాలకు ఇది రోజుకు 386 నిమిషాలు. అంటే మహిళలు రోజుకు సగటున 363 నిమిషాలు చెల్లించని పనిలో గడుపుతున్నారని, పురుషులతో పోలిస్తే 123 నిమిషాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని సర్వే స్పష్టం చేసింది.

దీనికి విరుద్ధంగా పురుషులు ఆదాయం పొందే పనిలో గణనీయంగా ఎక్కువ సమయం గడిపారు. మహిళలకు 302 నిమిషాలతో పోలిస్తే చెల్లింపు పనిలో రోజుకు 414 నిమిషాలు. ఫలితంగా చెల్లింపు, చెల్లింపు కార్యకలాపాలకు మహిళలు గడిపే మొత్తం సమయం పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళలు వేతన ఉపాధిలో పాల్గొంటున్నప్పటికీ వారి మొత్తం భాగస్వామ్య రేటు తక్కువగానే ఉంది. దీనికి కారణం ఆదాయం లేని బాధ్యతల భారం ఎక్కువగా ఉండడం.
-సలీమా

మహళా హక్కులపై దాడి చేసే బడ్జెట్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మహిళలకు తగిలిన పెద్ద దెబ్బ ఉపాధి హామీ పథకానికి నిధులు భారీగా కోత పెట్టడం. ఇవ్వాల్సిన దాంట్లో కేవలం మూడు శాతం మాత్రమే కేటాయించారు. మహిళలు ఎంతెంత దూరం నుండో ఉపాధి పని కోసం వస్తుంటారు. ఈ కష్టాలేవీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టేటప్పుడు పట్టించుకోలేదు. ఇక విద్యారంగం మీద తీవ్ర భారం పడబోతోంది. ఇప్పటికే యూనివర్సిటీల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ప్రాథమిక, హైస్కూల్‌ విద్యకు కేటాయించే బడ్జెట్‌లో కూడా భారీగా కోతలు విధించారు. అంటే ఆ పాఠశాలలన్నీ భవిష్యత్తులో మూసివేయడం ఖాయం. మన దేశంలో ఎక్కువ శాతం అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణలేని సమాజంలో దూరం పంపించి అమ్మాయిలను చదివించే పరిస్థితి లేదు. కాబట్టి బడ్జెట్‌ తగ్గించి అమ్మాయిలను ప్రాధమిక విద్యకు కూడా దూరం చేయాలని కేంద్ర సర్కారు నిర్ణయించుకుంది. షీ మార్ట్‌ ప్రవేశపెడుతున్నాం అంటున్నారు. అంతకు ముందు మేకెన్‌ ఇండియా అన్నారు. ఈ షీ మార్ట్స్‌ ఎప్పుడో ఉన్నాయి. కానీ వాటి నిర్వహణ, కొనసాగింపు ప్రశ్నార్ధకంగా ఉంది.

వీటిపై ఓ స్పష్టత లేదు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన ఏ హమీని కూడా అమలు చేయలేదు. కేవలం మాటలు చెప్పి ఊరుకుంటున్నారు. ఈ షీ మార్ట్స్‌ కూడా అలాంటివే. అమ్మాయిల కోసం హాస్టల్స్‌ పెడతామంటున్నారు. విద్యా రంగానికి బడ్జెట్‌ తగ్గించి కొత్తవి ఎక్కడి నుండి తెచ్చిపెడతారు. ఇక వైద్య రంగం… ప్రభుత్వ హాస్పిటల్స్‌ ఎంత దారుణంగా ఉన్నా దేశంలో సగం మంది మహిళలు వైద్యం కోసం అక్కడికే వెళుతున్నారు. ఎందుకంటే మహిళలు తమ ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు చేయడానికి సాహసించారు. అలాంటప్పుడు వైద్య రంగానికి కేటాయింపులు తగ్గించడమంటే మహిళల ఆరోగ్యంతో ఆటలాడటమే. సెల్ఫ్‌ హెల్ఫ్‌ గ్రూపులకు ఇచ్చే వాటిల్లో కూడా కోతలు విధించారు. గృహ హింసపై పని చేసే సఖీ సెంటర్లు జిల్లాకు ఒకటి మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెంచమంటే వాటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ బడ్జెట్‌ ఉంది. ప్రభుత్వానికి మహిళల పట్ల నిజంగా ప్రేమా, గౌరవం ఉంటే మహిళలు ఉత్పత్తి రంగంలో అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్‌ ఉండాలి. కానీ ఏ విధంగా చూసినా మహిళల హక్కులపై దాడి చేసే విధంగానే ఈ బడ్జెట్‌ ఉంది.
-దేవి, సామాజిక కార్యకర్త

మహిళా వ్యతిరేక బడ్జెట్‌ ఇది
2026-27కు సంబంధించిన బడ్జెట్‌ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ‘మహిళలు’ అనే పదాన్ని ఐదుసార్లు ప్రస్తావించినప్పటికీ దేశంలోని మెజారిటీ మహిళల ప్రస్తుత దుర్భర స్థితిగతులను ఈ బడ్జెట్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. నామమాత్రపు పెంపుదల వల్ల దేశంలో మహిళల అభివృద్ధి కుంచించుకుపోయేలా ఉందని స్పష్టంగా కనబడుతుంది. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ 0.53శాతం నుండి 0.05శాతంకి పడిపోయింది. దేశంలోని మహిళల జీవితాలు, జీవనోపాధి సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని ఈ కేటాయింపు చాటిచెబుతున్నాయి. స్ట్రీమ్‌ రంగాల్లో మహిళల కోసం హాస్టళ్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తల గురించి ప్రస్తావించారు.

ఇందులో చదివే మహిళలు ల్యాబ్‌లలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, భద్రత లేమి వంటి అంశాలపై అస్సలు స్పందించలేదు. అయితే బేటీ బచావో బేటీ పఢావో, వన్‌ స్టాప్‌ సెంటర్‌, నారీ అదాలత్‌ వంటి పథకాల కలిసి ఉన్న ‘సంబల్‌’ కేటాయింపులు రూ. 629 కోట్ల నుండి రూ. 627 కోట్లకు తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ తగ్గుదల చాలా ఎక్కువ. ఎరువులు, ఆహార రాయితీలలో కోతలు విధించారు. వ్యవసాయంలో స్వయం ఉపాధి పొందుతున్న కోట్లాది మంది మహిళలకు ఇది పెద్ద దెబ్బ. అలాగే ఐసిడిఎస్‌, ఆశా కార్యకర్తలు, ఇతర మహిళా ఉద్యోగుల పథకాలకు బడ్జెట్‌ పెంచలేదు. ‘లఖ్‌ పతి దీదీ’ పథకం విజయం సాధించిందని చెబుతూ, ప్రభుత్వం ‘షీ’ (SHE – Self-Help Entrepreneur hubs) అనే కొత్త నమూనాను ప్రకటించింది.

అయితే ఐద్వాగా మేము నిర్వహించిన సర్వేలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల అప్పుల ఊబిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో తేటతెల్లమైంది. ఇన్నోవేటివ్‌ ఫైనాన్స్‌ పేరిట మహిళలను మరింత అప్పుల పాల్జేసే ప్రమాదం ఉంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే డేటా ప్రకారం మహిళల్లో ప్రధాన సమస్యగా ఉన్న రక్తహీనతను ఈ బడ్జెట్‌ విస్మరించింది. మహిళలపై పెరుగుతున్న ‘వేతనం లేని సంరక్షక పని’ భారాన్ని పట్టించుకోకుండా కేవలం కేర్‌ వర్క్‌ శిక్షణ గురించి మాట్లాడారు. మొత్తానికి ఈ బడ్జెట్‌ దేశంలోని మహిళల స్థితిగతులను విస్మరించింది, వారి దీర్ఘకాలిక డిమాండ్లను అవమానించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆయా వర్గాల్లోని మహిళలపై ఈ నిధుల కోత తీవ్ర ప్రభావం చూపుతుంది. బాధితులైన మహిళల ఆందోళనలను పట్టించుకోని ఈ ‘మహిళా వ్యతిరేక బడ్జెట్‌’కు వ్యతిరేకంగా పోరాడతాం.
-మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -