Friday, February 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజియూనియన్‌ బడ్జెట్‌-బీఎస్‌ఎన్‌ఎల్‌

యూనియన్‌ బడ్జెట్‌-బీఎస్‌ఎన్‌ఎల్‌

- Advertisement -

ఏ బడ్జెట్‌ అయినా అది కేవలం ఆదాయ, వ్యయాల లెక్క కాదు. అది పాలకుల వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించే రాజకీయ పత్రం. 2026-27 కేంద్రబడ్జెట్‌ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ బడ్జెట్‌లో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు భారీ నిధులు కేటాయించినప్పటికీ, దాని స్వభావం, ఉద్దేశ్యం, పరిమితులను కార్మికవర్గ కోణంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 1991 తర్వాత అమల్లోకి వచ్చిన నయా, ఉదారవాద విధానాల మౌలిక లక్ష్యం-ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం, కార్మిక వ్యయాన్ని తగ్గించడం, ప్రయివేటు మూలధనానికి కొత్త మార్కెట్లు సృష్టించడం. ఈ విధానాల క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ‘సామాజిక బాధ్యత’ నుంచి ‘వ్యాపార లాభదాయకత’దిశగా మళ్లించబడ్డాయి. కానీ, టెలికాం రంగం లాంటి వ్యూహాత్మక రంగంలో ప్రభుత్వ రంగ సంస్థను పూర్తిగా తొలగించడం పాలక వర్గానికి సాధ్యం కాదు.

ఇక్కడే బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి ఒక పరిస్థితి ఏర్పడింది.కేటాయించిన నిధులు రూ.28,473 కోట్ల పెట్టుబడిదారుల అవసరాల కోసమే తప్ప ప్రభుత్వ రంగంపై ఉన్న ప్రేమవల్ల కాదు. ఇది పాలక వర్గం వస్తువాద అవసరాల ఫలితం. డిజిటల్‌ ఇండియా, భారత్‌నెట్‌, గ్రామీణ కనెక్టివిటీ, జాతీయ భద్రత-ఈ అన్ని విధానాలు అమలు కావాలంటే ప్రయివేటు మూలధనం మాత్రమే సరిపోదు. అందుకే ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఒక పాలసీ టూల్‌గా ఉపయోగిస్తోంది. ఇది ”పునరుజ్జీవనం” కాదు, ఉపయోగాత్మక జీవన పరిరక్షణ. క్యాపిటల్‌కు మద్దతు – శ్రమకు నిరాకరణ, బడ్జెట్‌లో కనిపించే మరో ముఖ్య లక్షణం. క్యాపిటల్‌ ఇన్ఫ్యూషన్‌ ఉంది. కానీ శ్రమకు గుర్తింపు లేదు. 4జి/5జి నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌, ఫైబర్‌ వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ, అదే ప్రభుత్వం ఉద్యోగుల మూడవ వేతన సవరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇది యాదృచ్ఛికం కాదు.

నయా,ఉదారవాద విధానాల్లోని మౌలిక సిద్ధాంతం పెట్టుబడిదారి విధానాన్ని పోషించడం- లేబర్‌ను నియంత్రించడం.అవుట్‌ సోర్సింగ్‌-హక్కులు లేని కార్మికుల్ని నియమించడం. ఈ బడ్జెట్‌ అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు వ్యవస్థపై మౌనం వహించడం ఒక స్పష్టమైన రాజకీయ నిర్ణయం. నయా, ఉదారవాద ఆర్థిక విధానాల్లో కాంట్రాక్టు కార్మికుడనేది తక్కువ ఖర్చుతో, హక్కులు లేని, సంఘటితమయ్యే అవ కాశాలు లేని ఒక ”ఆదర్శ కార్మికుడు”. బీఎస్‌ఎన్‌ఎల్‌లో అవుట్‌సోర్సింగ్‌ పెరగడం కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, ఇది ఉద్యోగులు, కార్మికులు సమిష్టి బేరసారాలు చేసే అవకాశం లేకుండా చేయడం, ఇంకా చెప్పాలంటే ఐక్యతను విచ్చిన్నం చేయడం. అందుకే ఈ దశలో ట్రేడ్‌ యూనియన్ల పాత్ర సాధారణ డిమాండ్లకే పరిమితం కాకూడదు.ఇది ఒక వర్గ పోరాట దశ. బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంగా కాపాడటం, ఉద్యోగులను హక్కులున్న కార్మికులుగా నిలబెట్టడం, నయా,ఉదారవాద దాడిని ప్రతిఘటించడం, ఇవి చరిత్రాత్మక కర్తవ్యాలు. వాటిని ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెలో చాటాలి.

  • జి.సాంబశివరావు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -