Friday, February 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమోకరిల్లిన మోడీ!

మోకరిల్లిన మోడీ!

- Advertisement -

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌, అమెరికా ట్రేడ్‌ డీల్‌పై ఉభయసభలూ అట్టుడుకుతున్నాయి. ”భారత్‌పై విధించిన సుంకాలను పద్దెనిమిది శాతానికి అమెరికా తగ్గించిందని, అందుకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాలు ‘జీరో’ స్థాయికి చేరతాయని” ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదన్న షరతుకు సైతం తలొగ్గి…ట్రంప్‌ ప్రకటనకు మోడీ ధన్యవాదాలు తెలపడం భారతదేశ ఆత్మగౌరవాన్ని, ఆర్థిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. మన దేశ రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీసే విధంగా తన వ్యవసాయోత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. మనం ఏయే దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండాలో కూడా అమెరికానే నిర్దేశిస్తోంది. ఇలాంటి తలబిరుసు పెత్తనానికి భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచకూడదు. కానీ, మన ప్రధాని పూర్తిగా దాసోహపడటం మనదేశ ప్రతిష్టకు, ప్రయోజనాలకు తీవ్రమైన దెబ్బ. అమెరికా సరుకుల డంపింగ్‌ యార్డ్‌గా భారత్‌ను మారుస్తున్నారు మోడీ.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి ఎన్నికయ్యాక… తన దారిలోకి రాని దేశాలపై ఎడా పెడా పన్నులు బాదడం తన వ్యూహంగా ఎంచుకున్నాడు. కెనడా, బ్రిటన్‌, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలపైనా, రష్యా, చైనా వంటి పోటీ దేశాలపైనా విరుచుకుపడ్డాడు. సుంకాల విధింపుతో ఆయా దేశాల వాణిజ్యానికి తాత్కాలికంగా నష్టం కలగొచ్చు గానీ, ధరలు పెరిగి అమెరికా పౌరులకు కూడా అంతే సమస్య ఎదురవుతుంది. దీంతో, ట్రంప్‌ దూకుడుకు వ్యతిరేకంగా అమెరికాలోనూ పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. సుంకాలు ఎదుర్కొన్న అనేక దేశాలు సైతం అదే పద్ధతిలో ‘నీకు మేమంత దూరమో..మాకు నువ్వూ అంతే దూరం’ అని తిరుగు టపా పంపాయి. ఈ సుంకాలలో మార్పు రైతులకు మేలు చేస్తుందని మోడీ ప్రభుత్వం మరో పచ్చి అబద్దం చెప్తోంది. నిజానికి ఇది మన రైతాంగానికి, పరిశ్రమలకు, వ్యాపారులకు కూడా విపరీతమైన నష్టం కలిగిస్తుంది. మరీ విచిత్రం ఏమిటంటే ఈ విషయమై అమెరికా నుంచి ప్రకటన వెలువడిందే తప్ప మనదేశం నుంచి కాదు. పైగా మోడీ అభ్యర్ధన మేరకే ఈ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ అంటున్నారు.

అమెరికాతో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం రైతులకు శరాఘాతం. దీని దుష్ప్రభావం రైతులకే పరిమితం కాదు. దేశ ప్రజలందరూ అధిక ధరలు భరించవలసి వస్తుంది. మోడీ మొహం చూడడానికే ఇష్టపడని ట్రంప్‌ ఈ ఒప్పందం కుదిరినట్టు చెప్పినప్పుడు ప్రియమైన మోడీ అని సంబోధించారు. మోడీ మురిసిపోయారు. ఇది మోడీ నిస్సిగ్గుగా ట్రంప్‌కు దాసోహం అనడమే. మోడీ ఎన్ని ప్రగల్భాలు పలికినా వ్యవసాయంపై ఆధారపడిన దాదాపు 70-80 కోట్ల మంది జనం వెన్నులో బాకు దించడమే. అంతేకాదు అమెరికాలోని కీలక రంగాల్లో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి మోడీ హామీ ఇవ్వడం మన ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ ఒప్పందం గురించి పార్లమెంటుకు మాట మాత్రంగానైనా చెప్పకపోవడం చూస్తే మోడీకి పార్లమెంటు అంటే ఎంత తృణీకారభావన ఉందో తేలిపోతోంది.

ఒకవేళ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయోత్పత్తులు చౌకగా వస్తాయనుకున్నా దీని అంతారర్థం ఏమిటంటే భారత రైతుల నుంచి ప్రభుత్వం కొనడం తగ్గిపోతుంది. ఇది మనరైతుల నడ్డి విరవడమే. మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఉపసంహరించి మహోపకారం చేశామంటున్న మోడీ… అమెరికా దోపిడీకి సకల అవకాశాలు కల్పిస్తూ తలుపు తెరిచారు. దీనివల్ల అమెరికా రైతులకు అపారమైన లాభం ఉంటుందని అమెరికా వ్యవసాయ మంత్రి బ్రుక్‌ రోలిన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారంటే ప్రయోజనం ఎవరికో చెప్పక్కర్లేదు. రైతులు, పశుపాలకులు, మత్స్య కార్మికుల ప్రయోజనాల విషయంలో ఎన్నడూ రాజీ పడబోమని మోడీ ఆ ప్రసంగంలో గొంతు చించుకుని మరీ చెప్పారు. మరి ఇప్పుడు మోడీ ప్రకటన చూస్తే రాజీ పడడమే కాదు… దాసోహం అన్నారని స్పష్టంగా అర్ధం అవుతోంది. ఈ ఒప్పందం వల్ల రైతులే మూల్యం చెల్లించవలసి వస్తుందనడం వాస్తవం.

ఈ ఒప్పంందంతో మన రైతులకు ఒరిగేది మాత్రం శూన్యం. అమెరికా మార్కెట్‌ల కోసం మన రైతుల కడుపు కొడుతున్నారు. స్వావలంబన గురించి గొంతు చించుకోవడం తప్ప మోడీ చేసేదేమీ ఉండదు. మనకు చిరకాల మిత్రదేశమైన రష్యాతో చమురు దిగుమతి నిలిపివేయడానికి ఒప్పుకోవడం అంటే నికార్సైన మిత్రద్రోహమే. ఒక సార్వభౌమ దేశ ప్రధాని ఇంత లొంగుబాటు వైఖరిని ఎందుకు ప్రదర్శించినట్టు? లోపాయికారీ ఒప్పందాలతో దేశం పరువును ఎందుకు దిగజారుస్తున్నట్టు? ఇప్పుడు కూడా వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి స్పష్టతా ఇవ్వకుండా ట్రంప్‌కు కృతజ్ఞతలు చెప్పటానికే పరిమితం కావటం విచారకరం. ఇది గణతంత్ర దేశానికి తీవ్రమైన తలవంపు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -