రికార్డు ఆరో టైటిల్‌పై భారత్ గురి
ఫైనల్లో నేడు భారత్, ఇంగ్లాండ్ ఢీ
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్
మధ్యాహ్నం 1 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో ఏకంగా 11వ సారి టైటిల్ పోరుకు సై అంటున్న టీమ్ ఇండియా, నేడు రికార్డు ఆరో టైటిల్‌పై కన్నేసింది. 1998లో కప్పును ముద్దాడిన ఇంగ్లాండ్ ఆధునిక క్రికెట్‌లో తొలిసారి అండర్-19 ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. 2022 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్, ఇంగ్లాండ్ తలపడినా.. ఇంగ్లీశ్ జట్టుకు భంగపాటు తప్పలేదు. పరుగుల వరద పారనున్న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో నేడు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరు.
హరారే (జింబాబ్వే)
భారత్, ఇంగ్లాండ్.. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచిన జట్లు. గ్రూప్ దశ, సూపర్‌సిక్స్‌లో ముఖాముఖి తలపడని అగ్రజట్లు నేడు టైటిల్ పోరులోనే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 311 పరుగుల లక్ష్యాన్ని మరో 53 బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకోగా… డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు సై అంటోంది. ఇటు భారత్, అటు ఇంగ్లాండ్ శిబిరాల్లో బ్యాటర్లు, బౌలర్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు. 2022 ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లాండ్ ఎదురుచూస్తుండగా.. రికార్డు ఆరో టైటిల్ ముద్దాడేందుకు యువ భారత్ తహతహలాడుతోంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీ నేడు.
ఎదురుందా?
భారత కుర్రాళ్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌తో సెమీఫైనల్లో ఓపెనర్ అరోన్ జార్జ్ అదరగొట్టాడు. టోర్నీలో వరుసగా 7, 23, 16 పరుగులతో అరోన్ ఇబ్బందిపడినా.. కీలక సెమీస్‌లో దంచికొట్టాడు. మరో ఓపెనర్ సూర్యవంశీ వైభవ్ సహజశైలిలో రెచ్చిపోతున్నాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రె జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. విహాన్ మల్హోత్రా, ఆర్‌ఎస్ అంబ్రిశ్, హేనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్‌లు నేడు ఫైనల్లో భారత్‌కు కీలకం కానున్నారు. గ్రూప్ దశ, సూపర్‌సిక్స్‌లో ఇంగ్లాండ్‌తో తలపడలేదు కానీ వార్మప్ మ్యాచ్‌లో ఆ జట్టు చేతిలో భారత్ ఓడింది. అజేయంగా టైటిల్ పోరుకు చేరుకున్న భారత్.. నేడు అదే జోరు పునరావృతం చేయాలని అనుకుంటోంది. సెమీఫైనల్ వేదికలోనే టైటిల్ పోరు సైతం జరుగుతుంది. దీంతో భారత్ మరోసారి పరుగుల వరద పారించేందుకు సిద్ధమవుతోంది.
అతడే ఒక సైన్యం!
ఇంగ్లాండ్‌కు కెప్టెన్ థామస్ రెవ్ అతిపెద్ద బలం. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 110 పరుగుల సెంచరీ సాధించిన థామస్.. ఇంగ్లాండ్‌ను ఫైనల్లోకి నడిపించాడు. 299 పరుగులు, 74.75 సగటుతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో థామస్ నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరఫున బెన్ మేయెస్, బెన్ డాకిన్స్‌తో పాటు మానీ లమ్స్‌డెన్, ఫర్హాన్ అహ్మద్‌లు కీలకం కానున్నారు. 1998లో చివరగా విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత 2022లో ఫైనల్‌కు చేరినా భారత్ చేతిలో ఓటమి చెందింది. 2026లో మళ్లీ భారత్‌తోనే టైటిల్ పోరుకు సిద్దమైంది. 2022 ఓటమికి ప్రతీకారంతో పాటు ఇంగ్లాండ్‌కు వరల్డ్‌కప్ ట్రోఫీని మరోసారి అందించేందుకు థామస్ గ్యాంగ్ పట్టుదలగా కనిపిస్తోంది.



