నాలుగు నెలలుగా అందని జీతాలు
గతంలో ఇచ్చిన వేతనాల్లో కోతలు
ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆపరేటర్ల వేడుకోలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ-పంచాయతీ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు రాక ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఆపరేటర్లు జనన-మరణ ధృవీకరణలు, ఆస్తిపన్ను నమోదు, పారిశుధ్య సంబంధిత ఆన్‌లైన్ పనులు, ప్రభుత్వ పథకాల డేటా ఎంట్రీ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గ్రామ పరిపాలన సజావుగా సాగేందుకు పునాది వేస్తున్న వీరి వేతనాల్లో ప్రభుత్వం కోతలు పెట్టింది.. పని భారం మాత్రం తగ్గలేదు. ఇచ్చే వేతనం కూడా సక్రమంగా ఇవ్వడం లేదు.
ఇప్పటికే తక్కువ వేతనాలతో పని చేస్తున్న తమకు నెలనెలా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ ఖర్చులు, పిల్లల పీజులు, ఇంటి అద్దెలు, అప్పుల వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆపరేటర్లు ఆవేదన చెబుతున్నారు. అప్పులు చేసి జీవనం కొనసాగించాల్సి వస్తోందని కొందరు పనిని వదిలేయాలా అనే స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల్లో కోత విధించడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు. వేతనాలు తగ్గించినా పనిభారం మాత్రం పెరిగిందని, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారుల ఒత్తిడి కొనసాగుతోందని వారు అంటున్నారు.
గ్రామాల్లో కీలక బాధ్యతలు వారికే..
గ్రామాల్లో ప్రజలకు పాలన చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పంచాయతీ ఆపరేటర్ల విధానం తీసుకొచ్చింది. పంచాయతీ ఆపరేటర్లు జనన-మరణ ధృవీకరణలు, ఆస్తిపన్ను నమోదు, పారిశుధ్య సంబంధిత ఆన్‌లైన్ పనులు, ప్రభుత్వ పథకాల డేటా అప్‌డేషన్ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు, సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, మెదక్ జిల్లాలో 492 గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాల అప్‌డేషన్ వంటి కార్యక్రమాలను ఆన్‌లైన్ ద్వారా ఎంట్రీ చేస్తారు. వారికి వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు.
ఎంపీడబ్ల్యూ వర్కర్స్ మిగులు బడ్జెట్ నుంచి వారికి వేతనాలు ఇస్తున్నారు. నెల వేతనం రూ.22750 నుంచి తగ్గించి రూ.19500 మాత్రమే చెల్లిస్తున్నారు. రూ.3250 కోత విధించారని అంటున్నారు. నాలుగు నెలలైనా వేతనాలు రావడం లేదని వాపోయారు. ఎంపీడబ్య్లూ వర్కర్స్ మిగులు నిధుల నుంచి కాకుండా ఐఎఫ్‌ఎంఎస్ కోటా నుంచి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతి నెలా 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని ఆపరేటర్లు కోరుతున్నారు. అదే విధంగా తక్షణమే పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలను విడుదల చేయాలని, తగ్గించిన వేతనాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామ పంచాయతీల్లో అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ అప్‌లోడ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. నెల నెలా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్టు మాకూ ఇవ్వాలి. అదనపు పని భారాన్ని మోస్తున్నా కూడా మాకు రెగ్యులర్‌గా వేతనాలు చెల్లిచడం లేదు. జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్స్ సంఘం జిల్లా కోశాధికారి
కీలక బాధ్యతలు
ఆపరేటర్లు గ్రామ పంచాయతీల్లో కీలక పనులన్నీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల డేటాను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేస్తున్నారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం. మాకు ఎంపీడబ్య్లూ వర్కర్స్ మిగులు నిధుల నుంచి వేతనాలు ఇస్తున్నారు. అలా కాకుండా ఐఎఫ్‌ఎంఎస్ కోటా నుంచి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. తగ్గించిన వేతనాన్ని పునరుద్ధరించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
సాయిబాబు ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు



