15వ ఆర్థిక సంఘం నిధులు రూ.259.36 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల గడువు ముగిసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో కేంద్రం నిధులను పూర్తిగా నిలిపివేసింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో నిధుల విడుదలకు ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్ల వరకు నిధులు అందాల్సి ఉంది. ఈ క్రమంలోనే తొలివిడతగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కావడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని తెలిపారు. మిగిలిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.



